jobs: అమెజాన్ లో జాబ్ కొట్టాలంటే.. ఈ స్కిల్స్ ఉండాలట
- విశ్రాంతి కోరుకోకూడదు.. సంతృప్తి చెందకూడదు
- ఇలాంటి వారితో అద్భుత ఫలితాలు ఉండవన్న అమెజాన్ సీనియర్ అధికారి
- అసంతృప్తితో కొత్త ఆవిష్కరణలు వెలుగు చూస్తాయన్న అభిప్రాయం
అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, మెటా.. ఇవన్నీ ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు. దిగ్గజాలు అయ్యాయంటే టెక్నాలజీతోపాటు, ఆవిష్కరణలు, సేవలు సహా ఎన్నో అంశాల్లో ప్రత్యర్థుల కంటే ముందుండడం వల్లేనని చెప్పుకోవాలి. మరి అలాంటి దిగ్గజ కంపెనీల్లో కొలువు సంపాదించాలని ప్రతి ఇంజనీర్ కు ఉంటుంది. ఆ ఆకాంక్ష సాకారం కావాలంటే..? కొన్ని నైపుణ్యాలు అలవరుచుకుని, ఆలోచనా విధానం మార్చుకోవాల్సి ఉంటుంది.
అమెజాన్ లో కొలువు పొందాలంటే ఏమి కావాలి? అమెజాన్ వెబ్ సర్వీసెస్ సీఈవో ఆడమ్ సెలిప్ స్కీ ఇదే ప్రశ్నను ఓ మ్యాగజైన్ సంస్థ ఇంటర్వ్యూ సందర్భంగా ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగంలోకి తీసుకునే వారిలో ఏ నైపుణ్యాలను తాము చూసేదీ ఆయన వెల్లడించారు. విశ్రాంతి ఎరుగని, సంతృప్తి చెందని వ్యక్తులనే తాము ఎంపిక చేస్తామని చెప్పారు. టీమ్ సభ్యులుగా ఈ లక్షణాలు ఉన్న వారిని తాను సెలక్ట్ చేసుకుంటానని చెప్పారు. ప్రపంచం ఎలా పనిచేస్తుంది? అన్న దానిపై ఆసక్తి కలిగి ఉండాలన్నారు.
‘‘ఈ తరహా లక్షణాలు, నైపుణ్యాలున్న వారిని ఎంపిక చేసుకుని.. తమ మధ్య ఆలోచనలను స్వేచ్ఛగా పంచుకుంటూ, ఓ ఉమ్మడి లక్ష్యంపై దృష్టి సారించే వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాను’’ అని సెలిప్ స్కీ తెలిపారు. తమ పని పట్ల సంతృప్తి చెంది, విశ్రాంతి తీసుకునే వారితో అద్భుతాలు సాధ్యం కావన్నది సెలిప్ స్కీ అభిప్రాయం. అసంతృప్తి అనేది వారి నుంచి మరిన్ని ఆవిష్కరణలు, ఉత్పాదకతకు దారి తీస్తాయని నమ్ముతారు. ఈ రెండూ తప్పక ఉండాలని సూచిస్తున్నారు. యువత తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకోవాలని, సరైన వ్యక్తుల మధ్య ప్యాషన్ గా ఉంటూ, పని చేసుకోవాలని సూచించారు.