Sajjala Ramakrishna Reddy: రాష్ట్రానికి ఏ పారిశ్రామికవేత్త వచ్చినా సీఎం జగన్ బంధువులని ప్రచారం చేస్తున్నారు: సజ్జల ఫైర్
- పెట్టుబడులు వస్తుంటే విపక్ష నేతలు ఓర్వలేకపోతున్నారన్న సజ్జల
- ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని వెల్లడి
- గత సర్కారుకు ఓ విధానమంటూ లేదని విమర్శలు
- సీఎం జగన్ ఒకే విధానం అనుసరిస్తున్నారని స్పష్టీకరణ
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే ఓర్వలేకపోతున్నారని, విషం కక్కుతున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా, రాష్ట్రానికి ఏ పారిశ్రామికవేత్త పెట్టుబడులతో వచ్చినా సీఎం జగన్ బంధువులని ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
"ఒకవైపు రాష్ట్రానికి పరిశ్రమలు రావడంలేదని వాళ్లే అంటారు. మరోవైపు, పరిశ్రమలు వస్తుంటే ఎందుకు వస్తున్నాయని బాధపడుతుంటారు. లేకపోతే, అవి అసలు ఇండస్ట్రీలే కాదంటారు... మీ అస్మదీయులకు, బంధువులకు ఇస్తున్నారంటారు.
పారిశ్రామికవేత్తలు ఏ వర్గం, ఏ సామాజిక వర్గం అనేది చూడడంలేదు. సదరు ఇండస్ట్రీని ఎంతవరకు ప్రోత్సహించాలి, ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు అవసరమైన ప్రమాణాలు ఏమిటి? ఒక పరిశ్రమ పట్ల ఒక విధానం, మరో పరిశ్రమ పట్ల మరో విధానం లేకుండా, ఏ పరిశ్రమ వచ్చినా ఒకే విధానాన్ని సీఎం జగన్ ప్రభుత్వం అనుసరిస్తోంది" అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పరిశ్రమలకు ఓ విధానం అంటూ లేకుండా అనుమతులు ఇచ్చిందని, సీఎం జగన్ నిబంధనలు పాటిస్తూ సత్వరమే అనుమతులు ఇస్తున్నారని స్పష్టం చేశారు.