Janasena: సత్తెనపల్లిలో ఈ నెల 18న జనసేన కౌలు రైతు భరోసా కార్యక్రమం
- ఏపీలో కౌలు రైతుల ఆత్మహత్యలు
- రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం చేస్తున్న జనసేన
- ఇప్పటిదాకా 7 జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్ర పూర్తయిందన్న నాదెండ్ల
రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు జనసేన పార్టీ కౌలు రైతు భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ నెల 18న పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా కార్యక్రమం చేపడుతున్నట్టు ఆ పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడేళ్లలో అధికారిక లెక్కల ప్రకారం 1,673 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వివరించారు. రైతు స్వరాజ్య వేదిక సర్వే ప్రకారం ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల సంఖ్య 3 వేలకు పైనే ఉందని తెలిపారు. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు జనసేన పార్టీ నుంచి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు 7 జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్ర కార్యక్రమం పూర్తయిందని నాదెండ్ల పేర్కొన్నారు.
రైతులు క్రాప్ హాలిడే కాకుండా, వైసీపీ ప్రభుత్వానికి హాలిడే ప్రకటించాలని ఆయన పిలుపునిచ్చారు.