Karnataka: తన భార్య ప్రియుడి సెల్‌ఫోన్ సమాచారాన్ని పరిశీలించాలన్న భర్త.. కుదరదన్న హైకోర్టు
- విడాకుల కేసులో కర్ణాటక హైకోర్టు తీర్పు
- తన భార్యకు వేరొకరితో వివాహేతర సంబంధం ఉందన్న భర్త
- విడాకుల కేసులో మూడో వ్యక్తి గోప్యతకు భంగం కలిగించలేమన్న హైకోర్టు
తన భార్యకు వేరొకరితో వివాహేతర సంబంధం ఉందని, ఆ వ్యక్తి సెల్‌ఫోన్ సమాచారాన్ని విశ్లేషిస్తే అసలు విషయం తెలుస్తుందన్న భర్త విజ్ఞప్తిని కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. అలా పరిశీలించడం వ్యక్తిగత గోప్యతా హక్కును ఉల్లంఘించడమే అవుతుందని తేల్చి చెప్పింది. ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాల్లోకి వెళ్తే.. తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతూ 2018లో 37 ఏళ్ల మహిళ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
కేసు విచారణ సందర్భంగా.. తన భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, అతడి సెల్‌ఫోన్ సమాచారాన్ని పరిశీలిస్తే ఆ విషయం తెలుస్తుందని ఆమె భర్త వాదించాడు. దీంతో అతడి భార్య ప్రియుడిగా చెబుతున్న వ్యక్తి హైకోర్టుకెక్కాడు. తన ఫోన్ కాల్స్ వివరాలను కోరడాన్ని సవాలు చేశాడు. వాదనలు విన్న న్యాయస్థానం.. భార్యాభర్తల విడాకుల కేసులో మూడో వ్యక్తి గోప్యతకు భంగం కలిగించడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. ఇది ఆ వ్యక్తికి రాజ్యాంగం కల్పించిన గోప్యతా హక్కుకు భంగం కలిగించడమే అవుతుందని హైకోర్టు జడ్జి జస్టిస్ ఎం. నాగప్రసన్న తేల్చి చెప్పారు.