Yanamala: అవినీతి వద్దని అవినీతిపరుడే చెప్పడం హాస్యాస్పదం: యనమల
- అవినీతికి దూరంగా ఉండాలంటూ సీఎం జగన్ వ్యాఖ్యలు
- అవినీతిని సహించబోనని మంత్రులకు స్పష్టీకరణ
- ఈ శతాబ్దంలోనే అతిపెద్ద జోక్ అన్న యనమల
- కామెడీలో చార్లీచాప్లిన్ తో పోటీపడుతున్నాడని వ్యంగ్యం
దేశంలోనే అత్యంత అవినీతిపరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న జగన్ రెడ్డి అవినీతి చేయడానికి వీల్లేదని తన మంత్రులకు చెప్పడం ఈ శతాబ్దంలోనే అతిపెద్ద జోక్ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వ్యంగ్యం ప్రదర్శించారు.
ఇక నుండి అవినీతికి వీల్లేదనడమంటే... గత 42 నెలలుగా అవినీతికి గేట్లు తెరిచినట్లేనా? అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే కామెడీలో ఛార్లీ చాప్లిన్ తో పోటీ పడేందుకు ప్రయత్నిస్తున్నట్టుందని ఎద్దేవా చేశారు. సుమారు రూ.43 వేల కోట్ల ప్రజాధనం దోపిడీ కేసులో 24 సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లు ఎదుర్కొంటూ, 16 నెలల జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి జగన్ అని యనమల వివరించారు.
"జగన్ రెడ్డి ఇప్పుడు క్యాడర్ ను అప్రమత్తం చేయడం హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు తన ప్రమేయం లేకుండా అవినీతి చేయడానికి వీల్లేదు అనేలా తన ‘రెడ్డి’ సలహాదారులు మినహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల నుండి.. కిందిస్థాయి వరకు ఉన్న తన అనుచరుల్ని బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.
గత మూడున్నరేళ్లలో అక్రమ మైనింగ్ లో ఏపీ దేశంలోనే మూడో స్థానంలో ఉంది. అందుకు ఇసుక, బీచ్ శాండ్, లేటరైట్ పేరుతో ఏజెన్సీలో జరుగుతున్న బాక్సైట్ అక్రమ మైనింగ్ నుండి... నిన్న మొన్న విశాఖ జిల్లాలోని రుషికొండకు కొట్టిన బోడిగుండు వరకూ లెక్కకు మించిన సాక్ష్యాలు కళ్లముందున్నాయి.
మద్య నిషేధం పేరుతో రాష్ట్రంలోని మద్యం వ్యాపారం మొత్తాన్ని శాసిస్తూ ఇప్పటికే సుమారు రూ.30 వేల కోట్లు కొల్లగొట్టారు. ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో చేసిన దోపిడీ, ఆ స్థలాల చదును పేరుతో చేసిన దోపిడీ సొమ్ముతో అంతిమంగా నిండింది తాడేపల్లి ఖజానాయే.
విశాఖ రాజధాని పేరుతో జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి రూ.40 వేల కోట్ల విలువైన భూముల్ని తమ ఖాతాల్లో వేసుకున్నారు. చివరికి ప్రజల ఆస్తులైన విశాఖ స్టీల్ అమ్మకానికి పెట్టి అందులో వాటాలు పంచుకున్నారు. జగన్ రెడ్డి ఇప్పటికైనా కామెడీలు చేయడం మాని.. అప్పుల పాలై, అవస్థలు పడుతున్న రాష్ట్ర ఖజానాను మెరుగుపర్చే ప్రయత్నాలు చేయాలి" అని యనమల హితవు పలికారు.