Andhra Pradesh: సెలవుల కేలెండర్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం.. ఉగాది, శ్రీరామనవమి, వినాయక చవితికి బ్యాంకులకు నో హాలిడే!
- ఆదివారం వచ్చిన సంక్రాంతి, దుర్గాష్టమి, దీపావళి పండుగలు
- హిందూ పండుగలకు సెలవులు లేకపోవడంపై బ్యాంకర్ల అసంతృప్తి
- 23 సాధారణ సెలవులు, 22 ఐచ్ఛిక సెలవుల ప్రకటన
వచ్చే ఏడాదికి గాను ఏపీ ప్రభుత్వం సెలవుల కేలెండర్‌ను నిన్న విడుదల చేసింది. ఇందులో ప్రభుత్వ కార్యాలయాలకు 23 సాధారణ సెలవులు, 22 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్ ఉన్ నబీ వంటి పండుగలతోపాటు తిథులను బట్టి వచ్చే హిందూ పండుగల్లో మార్పులు ఉంటాయని, వాటిని ముందుగానే పత్రికా ప్రకటన, మీడియా ద్వారా తెలియజేస్తామని ప్రభుత్వం తెలిపింది.
అలాగే, ఉగాది, శ్రీరామ నవమి, వినాయక చవితి పండుగల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నతాధికారుల అనుమతితో ఐదు ఐచ్ఛిక సెలవులను పొందేందుకు వీలు కల్పించింది. ఇక, వచ్చే ఏడాది మూడు సాధారణ సెలవులు.. సంక్రాంతి, దుర్గాష్టమి, దీపావళి ఆదివారం వచ్చాయి. ఒకటి రెండో శనివారం వచ్చింది.
ఉగాది, శ్రీరామ నవమి, వినాయక చవితికి సెలవులు లేకపోవడంపై యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యమైన హిందూ పండుగలకు సెలవులు ఇవ్వకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం మూడేళ్లుగా ఇలాగే వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం వెంటనే ఈ మూడు పండుగలకు సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేసింది.