Ukraine: 2023 ప్రారంభంలో రష్యా భీకర దాడులు చేస్తుంది.. కొత్తగా 2 లక్షల మంది సైనికులను తీసుకుంటోంది: ఉక్రెయిన్
- రష్యా దాడులు తగ్గించడం వ్యూహంలో భాగమేనన్న ఉక్రెయిన్
- వచ్చే ఏడాది తొలి మూడు నెలల్లో మళ్లీ భారీ దాడులకు తెగబడుతుందని వ్యాఖ్య
- ఈలోగా యుద్ధ వనరులను సిద్ధం చేసుకుంటుందన్న ఉక్రెయిన్
ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఇటీవల అన్నారు. మరోవైపు తమ దేశం శ్మశానంగా మారిపోతున్నా ఉక్రెయిన్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. చివరి వరకు పోరాడతామని స్పష్టం చేసింది. మరోపక్క, ఉక్రెయిన్ కమాండ్ ఇన్ చీఫ్ జనరల్ వలేరీ జాలుజ్నీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2023 తొలి నెలల్లో రష్యా భీకర దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఆయన అన్నారు. దీని కోసం కొత్తగా 2 లక్షల మంది సైనికులను సిద్ధం చేసుకుంటోందని చెప్పారు. ఒక బ్రిటిష్ వీక్లీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో రష్యా దాడులు జరుగుతాయని ఆయన అన్నారు. జనవరి చివర్లో దాడులు మొదలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇప్పుడు రష్యా దాడులను తగ్గించడం కూడా యుద్ధ వ్యూహంలో భాగమేనని చెప్పారు. ఈ గ్యాప్ లో తన సైనిక బలగాలను పెంచుకోవడం ద్వారా మళ్లీ యుద్ధానికి పూర్తి స్థాయిలో సిద్ధమవుతుందని అన్నారు. యుద్ధానికి సంబంధించి ఇది చాలా వ్యూహాత్మక నిర్ణయమని చెప్పారు. తమ రాజధాని కీవ్ ను రష్యా అటాక్ చేస్తుందనే విషయంలో తనకు ఎలాంటి అనుమానం లేదని అన్నారు.
తాము కూడా రాబోయే రోజులను దృష్టిలో పెట్టుకుని అన్ని లెక్కలు వేసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఎన్ని ట్యాంకులు, ఆయుధాలు, సైనికులు కావాలనే విషయంలో తాము కూడా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఇప్పుడు తమ ముందు ఉన్న ప్రధాన లక్ష్యం ఫ్రంట్ లైన్ ను కాపాడుకోవడమేనని చెప్పారు. ఇకపై తమ భూభాగాన్ని కొంత కూడా వదులుకోవడానికి తాము సిద్ధంగా లేమని తెలిపారు. తమ శత్రువును తాము జయిస్తామనే నమ్మకం తనకు ఉందని... అయితే తమకు యుద్ధ వనరులు కావాల్సి ఉందని చెప్పారు. 300 యుద్ధ ట్యాంకులు, 600 నుంచి 700 వరకు ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వెహికిల్స్, 500 హోవిట్జర్ లు తమకు అవసరమని తెలిపారు.