fifa: మెస్సీకి గాయం.. ప్రపంచ కప్ ఫైనల్ కు దూరం అవుతాడా?
- క్రొయేషియాతో సెమీ ఫైనల్లో కాలి పిక్క నొప్పితో ఇబ్బంది పడ్డ మెస్సీ
- ట్రెయినింగ్ కు దూరంగా ఉన్న అర్జెంటీనా దిగ్గజం
- ఆదివారం ఫ్రాన్స్ తో అర్జెంటీనా ఫైనల్ మ్యాచ్
ఫిఫా ప్రపంచ కప్ నెగ్గి తన కెరీర్ కు ఘనమైన వీడ్కోలు పలకాలని ఆశిస్తున్న అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ వల్ల, ఆ దేశానికి షాక్ తగిలేలా ఉంది. ఈ ఆదివారం ఫ్రాన్స్ తో జరిగే ఫైనల్ కు మెస్సీ దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. తన అసమాన ఆటతో ఈ టోర్నీలో అర్జెంటీనాను మెస్సీ ఫైనల్ కు తీసుకొచ్చాడు. అయితే, తుది పోరుకు ముందు మెస్సీకి గాయం అయినట్టు తెలుస్తోంది. క్రొయేషియాతో సెమీఫైనల్ సందర్భంగా మెస్సీ కాలి పిక్క కండరాల నొప్పితో ఇబ్బంది పడుతూ కనిపించాడు. గురువారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ కు మెస్సీతో పాటు పలువురు అర్జెంటీనా ప్రధాన ఆటగాళ్లు గైర్హాజరయ్యారు.
దాంతో, మెస్సీకి గాయం అయిందన్న వార్తలు వస్తున్నాయి. అతని ఫిట్ నెస్ పై అనుమానాలు మొదలయ్యాయి. తమ దేశ చరిత్రలో మూడోసారి ప్రపంచ కప్ నెగ్గాలని కోరుకుంటున్న అర్జెంటీనా జట్టులో మెస్సీ చాలా కీలక ఆటగాడు. ఫైనల్లో తను లేకపోతే జట్టు డీలా పడిపోయే అవకాశం ఉంది. పైగా, ప్రత్యర్థి ఫ్రాన్స్ గత టోర్నీ విజేత. ఈసారి కూడా ఆ జట్టు అద్భుతంగా రాణిస్తోంది. ఇక, అర్జెంటీనా తరఫున ఈ టోర్నీ ఫైనలే తనకు చివరి మ్యాచ్ అని మెస్సీ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో తను తుదిపోరులో బరిలోకి దిగుతాడో లేదో చూడాలి.