CPI Ramakrishna: పవన్ వారాహి వాహనం చూసి మంత్రులు ఉలిక్కిపడినట్టుంది: సీపీఐ రామకృష్ణ

CPI Ramakrishna opines on controversy about Pawan Kalyan Varahi vehicle

  • ఏపీలో పవన్ బస్సు యాత్ర
  • వారాహి వాహనం సిద్ధం
  • వాహనం రంగుపై వైసీపీ నేతల విమర్శలు
  • మంత్రులకు పనేమీ లేదా అంటూ సీపీఐ రామకృష్ణ వ్యాఖ్యలు

జనసేన పార్టీ పవన్ కల్యాణ్ బస్సు యాత్ర కోసం సిద్ధమైన వారాహి వాహనం ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వాహనం రంగు నిబంధనలకు విరుద్ధమంటూ వైసీపీ నేతలు పవన్ పై ధ్వజమెత్తారు. 

ఈ నేపథ్యంలో, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఓ మీడియా చానల్ తో మాట్లాడుతూ పవన్ వారాహి వాహనంపై స్పందించారు. వారాహి వాహన రంగు తదితర అంశాలపై ప్రజల్లో జరిగిన ప్రచారం కంటే మీడియాలో జరిగిన ప్రచారమే ఎక్కువ అని వెల్లడించారు. మీడియాకు ఏ అంశాలు లేక ఇలాంటి విషయాలను హైప్ చేస్తుంటుందని అన్నారు. 

"పవన్ గానీ, మేము గానీ, ఇంకెవరైనా గానీ చట్టానికి లోబడి ఉండాల్సిన వాళ్లమే. చట్టాన్ని అతిక్రమించడానికి లేదు. ఒకట్రెండు రోజులైతే ఎవరికీ తెలియకుండా వాహనాన్ని తిప్పుకోవచ్చు. కానీ ఇక్కడ అలా కాదు కదా! ఒకవేళ పవన్ వాహనం నిబంధనలకు విరుద్ధమైతే ఆ విషయం చెప్పడానికి అధికారులు ఉన్నారు. హైదరాబాదులో రిజిస్ట్రేషన్ కాబట్టి తెలంగాణ ఆర్టీవో అధికారులు ఆ వాహనాన్ని పరిశీలిస్తారు. చట్టానికి అనుగుణంగా ఉంటే వాళ్లు అనుమతి ఇస్తారు. వాళ్లు రంగు మార్చుకోమన్నా, ఏవైనా పార్టులు మార్చుకోమన్నా పవన్ మార్చుకుంటాడు. 

అయినా పవన్ వాహనాన్ని చూసి ఏపీ అధికార పార్టీ నేతలు, మంత్రులు ఉలిక్కిపడుతున్నట్టుంది. పవన్ ఈ వాహనం కాకపోతే మరొక వాహనంలో అయినా యాత్ర చేయగలడు. దీనిపై ఒక మంత్రి స్టేట్ మెంట్ ఇస్తే ఫర్వాలేదు... పలువురు మంత్రులు ఇదే అంశంపై మాట్లాడుతున్నారంటే వాళ్లకు వేరే పనేమీ లేనట్టుగానే భావించాలి" అంటూ రామకృష్ణ వివరించారు.

  • Loading...

More Telugu News