Cheteshwar Pujara: పుజారా కూడా సెంచరీ కొట్టాడు... బంగ్లాదేశ్ ముందు 513 పరుగుల టార్గెట్
- రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసిన టీమిండియా
- 2 వికెట్లకు 258 పరుగుల స్కోరు వద్ద డిక్లరేషన్
- టీమిండియా ఇన్నింగ్స్ లో తొలుత గిల్ సెంచరీ
- ఆపై పుజారా వంతు
- బంగ్లాను భయపెడుతున్న భారీ టార్గెట్
ఛట్టోగ్రామ్ లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆతిథ్య బంగ్లాదేశ్ కు 513 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నేడు ఆటకు మూడో రోజు కాగా, రెండో ఇన్నింగ్స్ ను టీమిండియా 258/2 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
ఈ ఇన్నింగ్స్ లో ఏకంగా ఇద్దరు బ్యాట్స్ మెన్ సెంచరీలు నమోదు చేయడం విశేషం. ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 110 పరుగులు చేయగా, సీనియర్ ఆటగాడు ఛటేశ్వర్ పుజారా 102 పరుగులతో అజేయంగా నిలిచాడు. పుజారా శతకం పూర్తి చేసుకున్న అనంతరం టీమిండియా తాత్కాలిక సారథి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. కోహ్లీ 19 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
లక్ష్యం 500 పరుగులకు పైగా ఉండడంతో, బంగ్లాదేశ్ ఏదైనా అద్భుతం చేస్తే తప్ప ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఆటకు మరో రెండ్రోజుల సమయం ఉండడంతో బంగ్లాదేశ్ బ్యాటర్లు 200 ఓవర్లు ఆడేది అనుమానమే.
తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే చాపచుట్టేసిన బంగ్లా జట్టు... రెండో ఇన్నింగ్స్ లో భారీ లక్ష్యాన్ని ముందుంచుకుని ఒత్తిడి లేకుండా ఆడడం అయ్యే పనికాదు. ప్రస్తుతం ఆ జట్టు రెండో ఇన్నింగ్స్ ఆరంభించి 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది.