Dhulipala Narendra Kumar: సంగం డెయిరీని రైతులే కాపాడుకుంటారు: ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
- రాష్ట్రంలో సహకార డెయిరీలను కబళిస్తున్నారన్న ధూళిపాళ్ల
- అమూల్ కోసమేనని ఆరోపణ
- మంత్రి అప్పలరాజు సంగం డెయిరీ మెడపై కత్తిపెట్టారని విమర్శలు
- ఆయన తాతలు దిగొచ్చినా డెయిరీని లాక్కోలేరని స్పష్టీకరణ
పారిశ్రామికవేత్తల మెడపై కత్తిపెట్టి వారి ఆస్తుల్ని, సంస్థల్ని లాక్కుంటున్న జగన్ రెడ్డి, అమూల్ సంస్థ కోసమే రాష్ట్ర సహకార డెయిరీలను కబళిస్తున్నాడని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర పారిశ్రామిక రంగంపై విష సంస్కృతి మొదలైందని అన్నారు.
"ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తనకు నచ్చినవారికి మేలు చేయడానికే జగన్ రెడ్డి ఉపయోగిస్తున్నాడు. గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న వాటాను అతి తక్కువ ధరకు అమ్మిన వైసీపీ ప్రభుత్వం, కాకినాడ పోర్టుని, కాకినాడ ఎస్ఈజెడ్ పోర్టుని అరబిందో కంపెనీకి కట్టబెట్టింది. ఇప్పుడు రాష్ట్ర సహకార డెయిరీలను హస్తగతం చేసుకోవడానికే జగన్ రెడ్డి అమూల్ సంస్థను తెరపైకి తెచ్చాడు.
మంత్రి అప్పలరాజు సంగం డెయిరీ మెడపై కత్తిపెట్టి, అధికారబలంతో దాన్ని లాక్కోవచ్చు అనుకుంటున్నాడు. ఆయనే కాదు... ఆయన తాతలు దిగివచ్చినా సంగం డెయిరీని లాక్కోలేరు. సంగం డెయిరీని కాపాడుకునే సత్తా, సమర్థత పాడిరైతులకు ఉన్నాయి. మంత్రి సీదిరి అప్పలరాజు భాష, ప్రవర్తన చూస్తే, పశువులు కూడా ఆయన్ని తన్నేలా ఉన్నాయి.
మంత్రి అప్పలరాజు అవినీతి బాగోతంపై నక్సలైట్లు రెండుసార్లు లేఖలు రాశారు. కమీషన్ల కోసం పశువుల దాణాకు సంబంధించిన టెండర్ ని ఫర్టైల్ గ్రీన్ అనే సంస్థకు కట్టబెట్టింది జగన్ ప్రభుత్వం కాదా మంత్రివర్యా? రాష్ట్రంలో పశువుల దాణా సరఫరా మొత్తం వైసీపీ ఎమ్మెల్యేకి చెందిన వల్లభ ఫీడ్స్ కు అప్పగించింది నిజంకాదా?" అని ప్రశ్నించారు.
"మంత్రి పెద్దిరెడ్డి ఇలాఖాలో అమూల్ సంస్థ కోసం పాలుసేకరించే సత్తా, దమ్ము అప్పలరాజుకి, జగన్ రెడ్డికి ఉన్నాయా? 4.50 లక్షలమంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్న శ్రీజ డెయిరీని మంత్రి పెద్దిరెడ్డి చెరబట్టినప్పుడు జగన్ రెడ్డి ఏంచేశాడు?" అని ధూళిపాళ్ల నిలదీశారు.