Elon Musk: ప్రముఖ జర్నలిస్టుల ట్విట్టర్ ఖాతాలు నిలిపివేసిన మస్క్.. కారణం ఇదే!
- తన వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేసినందుకు ఈ చర్య అన్న మస్క్
- తనను రోజంతా విమర్శించినా పట్టించుకోనన్న ట్విట్టర్ అధినేత
- తనను గమనిస్తూ, వ్యక్తిగత సమాచారం సేకరిస్తే ఊరుకునేది లేదని స్పష్టీకరణ
ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత అనూహ్య నిర్ణయాలతో విమర్శలు ఎదుర్కొంటున్న ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన కార్యకలాపాలను పరిశీలిస్తూ కథనాలు రాసే పలువురు ప్రముఖ జర్నలిస్టుల ట్విట్టర్ ఖాతాలను మస్క్ నిలిపివేశారు. వీరిలో స్వతంత్రంగా పనిచేసే జర్నలిస్టులతో పాటు న్యూయార్క్ టైమ్స్, ద వాషింగ్టన్ పోస్ట్, సీఎన్ఎన్, వాయిస్ ఆఫ్ అమెరికా, తదితర ప్రముఖ సంస్థలకు చెందిన జర్నలిస్టులు ఉన్నారు. సదరు రిపోర్టర్లు తన ఆచూకీ గురించి ప్రైవేట్ సమాచారాన్ని పంచుకున్నారని ఆరోపించారు.
పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న డేటాను ఉపయోగించి తన ప్రైవేట్ జెట్ విమానాలను ఆటోమేటిక్‌గా ట్రాక్ చేసే ఖాతాను శాశ్వతంగా నిషేధించాలని మస్క్ బుధవారం నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత జర్నలిస్టుల ఖాతాలను ట్విట్టర్ సస్పెండ్ చేసింది. ఇది ట్విట్టర్ వినియోగదారులందరి కోసం నిబంధనలను మార్చడానికి దారితీసింది. వారి సమ్మతి లేకుండా మరొక వ్యక్తి యొక్క ప్రస్తుత లొకేషన్ ను వెల్లడించడాన్ని ట్విట్టర్ నిషేధించింది.
తన వ్యక్తిగత జెట్లను ట్రాక్ చేసే సైట్లను, ఖాతాలను తొలగిస్తున్నట్లు మస్క్ స్పష్టం చేశారు. రోజంతా తనను తిడుతూ ట్వీట్లు చేసినా పట్టించుకోనన్నారు. కానీ తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ, ప్రయాణించే విమానాలను ట్రాక్ చేసి, వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా చేసే పనుల్ని సహించనని మస్క్ ట్వీట్ చేశారు. కాగా, ఈ నిషేధం ఏడు రోజుల పాటే ఉంటుందని మస్క్ ప్రకటించినప్పటికీ తమ ట్విటర్ ఖాతా శాశ్వతంగా రద్దయినట్లు సమాచారం వచ్చిందని కొంత మంది జర్నలిస్టులు అంటున్నారు.