Health: పుట్టగొడుగులతో ఆరోగ్యం
- బరువు తగ్గడానికి తోడ్పడుతుందంటున్న నిపుణులు
- రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని వెల్లడి
- జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుందని చెబుతున్న వైద్యులు
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఆహార పదార్థాలలో పుట్ట గొడుగులు కూడా ఒకటి.. సహజంగా లభించే ఈ ఆహార పదార్థంలో మనకు అవసరమైన పోషకాలు ఎన్నో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో రక్తం తగ్గినా.. రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గినా పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకుంటే త్వరలోనే ఫలితం కనిపిస్తుందని వివరించారు. వీటిలో ఉండే ఫోలిక్ యాసిడ్, ఐరన్ లు మన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయులను పెంచుతాయన్నారు.
పుట్టగొడుగులను ఆయుర్వేదంలోనూ ఉపయోగిస్తారు. వీటితో తయారుచేసిన ఆహార పదార్థాలు రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. శరీరంలో పేరుకుపోయిన అధిక బరువును వదిలించుకోవడానికి పుట్టగొడుగులను తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వీటిలో కేలరీలు, కొవ్వు తక్కువగా వుంటాయని, వీటి ద్వారా శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుందని వివరించారు.
పుట్టగొడుగులలోని యాంటీఆక్సిడెంట్, యాంటీబయాటిక్ లక్షణాలు మన రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు పుట్టగొడుగులలో ఉండే ఫైబర్, కార్బోహైడ్రేట్లు మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయన్నారు. రోజువారీ ఆహారంలో పుట్టగొడుగులకు చోటు కల్పించడం ద్వారా మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని తెలిపారు.