Uttam Kumar Reddy: నాలుగు పార్టీలు మారిన వ్యక్తి కాంగ్రెస్ ను ఉద్ధరిస్తాడా?: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy comments on Revanth Reddy
  • మల్లు భట్టి విక్రమార్క నివాసంలో కాంగ్రెస్ సీనియర్ల సమావేశం
  • పార్టీలో జరుగుతున్న పరిణామాలు బాధిస్తున్నాయన్న ఉత్తమ్
  • కొందరిని అవమానించడానికే డీసీసీల ప్రకటన జరిగిందని విమర్శ
కాంగ్రెస్ హైకమాండ్ తాజాగా ప్రకటించిన టీపీసీసీ కమిటీలపై ఆ పార్టీ సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో వీరు భేటీ అయ్యారు. సమావేశానంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై చర్చించుకోవడం జరిగిందని తెలిపారు. ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలు చాలా బాధిస్తున్నాయని చెప్పారు. కొంతమందిని అవమానించడానికే డీసీసీల ప్రకటన జరిగిందని భావిస్తున్నట్టు తెలిపారు. 

తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తనను సపోర్ట్ చేసినవారు, వ్యతిరేకించిన వారు ఉన్నారని చెప్పారు. తనకు నచ్చిన వాళ్లే అన్ని పోస్టుల్లో ఉండాలని తాను ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. ప్రస్తుత కమిటీల్లో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల్లో 50 మందికి పైగా టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారని విమర్శించారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలంతా కోవర్టులని తీన్మార్ మల్లన్న పోస్టులు పెడుతున్నారని, నాలుగు పార్టీలు మారిన వ్యక్తి పార్టీని ఉద్ధరిస్తాడని చెపుతున్నాడని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారని ప్రశ్నించారు.
Uttam Kumar Reddy
congress
Revanth Reddy

More Telugu News