somireddy: ముద్దాయి అడిగితే సీబీఐ విచారణ చేపడతారా?: ఏపీ మంత్రి కాకాణిపై టీడీపీ నేత సోమిరెడ్డి విమర్శలు
- కోర్టు దస్త్రాల అపహరణపై సీబీఐ విచారణ
- దీనిపై మంత్రి అబద్ధాలు చెబుతున్నారని సోమిరెడ్డి ఆరోపణ
- కోర్టు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్లే సీబీఐ విచారణ జరుగుతోందని వివరణ
- కోర్టు నమ్మడం వల్లే విచారణకు ఆదేశించిందని వ్యాఖ్య
నెల్లూరు కోర్టులో దస్త్రాల చోరీ కేసు విషయంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఓ ముద్దాయి అడిగితే సీబీఐ విచారణ జరగదని మంత్రి తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. సీబీఐ విచారణ ఎవరు ఆదేశిస్తే జరుగుతుందో కూడా మంత్రికి అవగాహన లేదని విమర్శించారు. కాకాణి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మూడో రోజే నెల్లూరు కోర్టులో పత్రాల చోరీ జరిగిందని సోమిరెడ్డి ఆరోపించారు.
ఈ కేసు చూస్తుంటే ఢిల్లీలో ఉపహార్ కేసు గుర్తుకొస్తుందని చెప్పారు. ఉపహార్ కేసు విచారణకు వచ్చినపుడు ముద్దాయిలు ఇద్దరు కేసుకు సంబంధించిన పత్రాలపై ఇంకు పోశారని చెప్పారు. దీంతో అసలు కేసులో ముద్దాయిలకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి.. పత్రాలపై ఇంకు పోసినందుకు ఏడేళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారని సోమిరెడ్డి గుర్తుచేశారు.
కోర్టులో దస్త్రాలను చోరీ చేయాల్సిన అవసరం కాకాణికి మాత్రమే ఉందని సోమిరెడ్డి స్పష్టం చేశారు. మంత్రి అయినా చేయించాలి లేదా మంత్రి తరఫున ఎవరైనా చేసి ఉండాలని చెప్పారు. ఇది తెలుసుకున్నాకే హైకోర్టు స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించిందని సోమిరెడ్డి తెలిపారు. మంత్రి కాకాణి కోసం తప్పుడు పత్రాలను తయారుచేసిన వాళ్లేమో జైలులో ఉంటే, మంత్రి మాత్రం సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. కాకాణి కోసం జైలుకు వెళ్లిన ముద్దాయిలలో ఒకరు జైలులోనే చనిపోయాడని చెప్పారు. ఓ కేసు విచారణలో భాగంగా రోజూ హెడ్ కానిస్టేబుల్ ముందు సంతకం పెట్టొచ్చిన చరిత్ర కాకాణిదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు.
అసలేం జరిగిందంటే..
ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డి కొన్ని పత్రాలను గతంలో బయటపెట్టారు. ఆ పత్రాలు నకిలీవంటూ సోమిరెడ్డి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కాకాణిపై చార్జిషీట్ ఫైల్ చేశారు. ఈ కేసుకు సంబంధించి నెల్లూరు కోర్టులో విచారణ జరుగుతుండగా.. కోర్టులో డాక్యుమెంట్ల చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కోర్టులో చోరీ చేశారని సిబ్బంది గుర్తించారు. కీలకమైన డాక్యూమెంట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లారని ఆరోపణలు వచ్చాయి. దీనిని సీరియస్ గా తీసుకున్న హైకోర్టు.. కేసు విచారణను సీబీఐకి అప్పగించింది.