Roja: ఏనాడైనా పవన్ రెండు కాళ్లపై నిలబడడం చూశారా?: రోజా వ్యంగ్యం
- పవన్ వీకెండ్ పొలిటీషియన్ అన్న రోజా
- నోటికొచ్చినట్టు మాట్లాడొద్దంటూ వార్నింగ్
- ప్రజలే దేహశుద్ధి చేస్తారని వ్యాఖ్యలు
- ఈసారి కూడా ఓడిస్తే ఈ చుట్టుపక్కలకు కూడా రాడని ఎద్దేవా
జనసేన పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి రోజా ధ్వజమెత్తారు. 2019లో జగన్ సీఎం కారు... ఇది నా శాసనం అన్న వాడు శాసనసభ గేటు కూడా తాకలేకపోయాడని విమర్శించారు. జగన్ సీఎం అయితే సన్యాసం తీసుకుంటానన్నాడు... మరి రాష్ట్రంలో ఎందుకు తిరుగుతున్నాడో నాకైతే అర్ధం కావడంలేదు అంటూ రోజా వ్యాఖ్యానించారు.
రాజకీయాలకు పవన్ సరిపోరు... ఆయన వీకెండ్ పొలిటీషియన్... రాజకీయాలంటే పూర్తి సమయం కేటాయించాల్సి ఉంటుందని తెలిపారు. "పార్టీ పెట్టిన అధ్యక్షుడు మీరే రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల మిమ్మల్ని చిత్తుగా ఓడించారు. గతంలో ఓ పార్టీ పెట్టారు, ఇప్పుడొక పార్టీ పెట్టారు... మిమ్మల్నే కాదు, మీ బ్రదర్స్ కూడా సొంతూళ్లలో ఓడిపోయారు. మీ వాళ్లకే మీ మీద నమ్మకం లేదంటే ఇకనైనా అర్థం చేసుకోవాలి మీరు.
కేవలం సీఎం కుర్చీయే పరమావధి, దాని కోసమే మేం పనిచేస్తాం అంటే సినిమాల్లో రెండున్నర గంటల్లో ప్రొడ్యూసరో, దర్శకుడో అనుకుంటే ఆ పని చేయగలరు కానీ, ప్రజాక్షేత్రంలో అలా కుదరదు... ప్రజలు అన్నీ గమనిస్తారు.
ఈయన, ఈయన వారాహి గంగలో దూకుతారో, సముద్రంలో దూకుతారో వాళ్ల ఇష్టం. వైసీపీ నేతలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ప్రజలే దేహశుద్ధి చేస్తారు. ఏనాడైనా పవన్ రెండు కాళ్లపై నిలబడడం చూశారా? ఏనాడూ ఆయన కాళ్ల మీద నిలబడడు, మాట మీద నిలబడడు. ఒక కాలిపై నిలబడి డ్యాన్సులేస్తుంటాడు... ఈయనొచ్చి కులాలను నిలబెడతాడంట!" అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పవన్ ఎప్పుడో వారానికి ఒకసారి వస్తుంటారు... ఈసారి కూడా ఓడిస్తే ఇక ఈ చుట్టుపక్కలకు కూడా రాడు అని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే.... ఈ రాష్ట్రంలో ఓటు ఉందా, ఈ రాష్ట్రంలో ఇల్లు ఉందా? అని రోజా ప్రశ్నించారు.