Mohan Babu: విశాల్ కుటుంబంతో నాకున్న అనుబంధం అలాంటిది: మోహన్ బాబు
- విశాల్ హీరోగా లాఠీ
- వినోద్ కుమార్ దర్శకత్వంలో చిత్రం
- ఈ నెల 22న రిలీజ్
- తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్
- హాజరైన మోహన్ బాబు
కోలీవుడ్ హీరో విశాల్ నటించిన లాఠీ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నెల 22న లాఠీ రిలీజ్ కానున్న నేపథ్యంలో తిరుపతిలో కాలేజీ విద్యార్థుల మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాల్ తండ్రి జీకే రెడ్డి తనను హీరోగా పెట్టి ఎం ధర్మరాజు ఎంఏ అనే చిత్రాన్ని తీశారని వెల్లడించారు.
తాను గత ఎనిమిదేళ్ల నుంచి బయటి చిత్రాల ఈవెంట్లకు వెళ్లడం లేదని, కానీ విశాల్ ఎంతో చనువుగా అంకుల్ మీరు రావాల్సిందే అనడంతో రాకతప్పలేదని మోహన్ బాబు వెల్లడించారు. విశాల్ కుటుంబంతో తనకున్న అనుబంధం అలాంటిది అని పేర్కొన్నారు.
ప్రేమ చదరంగం, పొగరు వంటి చిత్రాలతో హిట్లు అందుకున్న విశాల్ కు కొంచెం పొగరు ఉన్న విషయం తనకు కూడా తెలుసని అన్నారు. మనిషన్న వాడికి పొగరుంటుందని, కానీ అది ఎదుటివాళ్లను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని మోహన్ బాబు అభిప్రాయపడ్డారు. ఇక, లాఠీ చిత్రం ట్రైలర్ చూశానని, తనకు ఎంతగానో నచ్చిందని వెల్లడించారు. పందెం కోడి చిత్రంలా ఇది కూడా ప్రేక్షకాదరణ పొందుతుందని అన్నారు.
కాగా, లాఠీ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల, ఎస్డీహెచ్ఆర్ కాలేజీల్లో విడివిడిగా నిర్వహించారు. ఎస్డీహెచ్ఆర్ కాలేజీలో జరిపిన ఈవెంట్ కు మోహన్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగానే పై వ్యాఖ్యలు చేశారు.
లాఠీ చిత్రానికి వినోద్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో విశాల్ సరసన సునైనా హీరోయిన్ గా నటించింది.