Ch Malla Reddy: పదవులు ఇచ్చేది కేసీఆర్, కేటీఆర్ తప్ప నేను కాదు: మల్లారెడ్డి
- మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఐదుగురు ఎమ్మెల్యేల సమావేశం
- తాను ఎవరితోనూ గొడవ పెట్టుకోనన్న మల్లారెడ్డి
- అందరితో మాట్లాడతానని వెల్లడి
నామినేటెడ్ పదవుల భర్తీలో మంత్రి మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిన్న ఆరోపించిన సంగతి తెలిసిందే. వీరిలో అరికెపూడి గాంధీ, మైనంపల్లి హన్మంతరావు, వివేకానంద్, మాధవరం కృష్ణారావు, భేతి సుభాష్ రెడ్డి ఉన్నారు. వీరంతా హైదరాబాద్ శివారులోని మైనంపల్లి నివాసంలో సమావేశమయ్యారు. నామినేటెడ్ పదవులను తన నియోజకవర్గం మేడ్చల్ నాయకులకే మల్లారెడ్డి కట్టబెడుతున్నారని వారు విమర్శించారు. ఈ భేటీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో మల్లారెడ్డి స్పందిస్తూ... పదవులు ఇచ్చేది కేసీఆర్, కేటీఆర్ తప్ప తాను కాదని అన్నారు. తాను గాంధేయవాదినని, ఎవరితోనూ గొడవ పెట్టుకునే రకం కాదని చెప్పారు. జిల్లాకు చెందిన అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడతానని అన్నారు. అవసరమైతే వారందరినీ తన ఇంటికి ఆహ్వానిస్తానని చెప్పారు. కావాలనే కొందరు ఈ విషయాన్ని పెద్దది చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఇంటి సమస్యలను అందరం కలిసి పరిష్కరించుకుంటామని చెప్పారు.