Dharmana Prasada Rao: అవినీతి అంటేనే నాకు నచ్చదు: ధర్మాన ప్రసాదరావు
- ఒక్క పైసా అవినీతికి పాల్పడ్డానని నిరూపించగలరా? అని సవాల్
- చంద్రబాబుకు కోట్లాది రూపాయల ఆస్తి ఎలా వచ్చిందని ప్రశ్న
- అవినీతి లేని సమాజం కోసం జగన్ కృషి చేస్తున్నారిని కితాబు
తనకు అవినీతి అంటేనే నచ్చదని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఒక్క నయాపైసా అవినీతికి పాల్పడ్డానని నిరూపించగలరా? అని సవాల్ విసిరారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు కోట్లాది రూపాయల ఆస్తి ఎలా వచ్చిందని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబుపై ఏవైనా కేసులు వేస్తే, కోర్టు నుంచి స్టేలు తీసుకొస్తారని విమర్శించారు.
తనను గెలిపించిన ప్రజలు తలదించుకునే పని తానెప్పుడూ చేయనని అన్నారు. ఉద్యోగులు కూడా అవినీతికి దూరంగా ఉండాలని చెప్పారు. పార్టీలోని నేతలందరూ ఆర్థికంగా చితికిపోయారని, అయినప్పటికీ ఎక్కడా అవినీతికి పాల్పడటం లేదని అన్నారు. అవినీతి లేని సమాజం రావాలని, ముఖ్యమంత్రి జగన్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.
మార్పు తీసుకురావాలనే జగన్ వంటి నేతలు కఠినంగా ఉంటారని... అలాంటి వ్యక్తిని నానా మాటలు అంటూ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.