Mani: కరోనా భయంతో మూడేళ్లుగా ఇంట్లోంచి బయటికి రాని తల్లీకూతుర్లు!

Mother and daughter does not stepped out due to corona fear in Kakinada district

  • కాకినాడ జిల్లాలో విస్మయం కలిగించే ఘటన
  • భారత్ లో 2020 నుంచి కరోనా వ్యాప్తి
  • అప్పటి నుంచి ఇంటికే పరిమితమైన తల్లీకూతుర్లు 
  • బయటికి తీసుకువచ్చేందుకు ఆరోగ్య సిబ్బంది ప్రయత్నం

భారత్ లో 2020 జనవరిలో తొలి కరోనా కేసు బయటపడింది. అంతటి భయంకర వైరస్ ను మునుపెన్నడూ ఎరగని యావత్ దేశం ప్రాణాలు కాపాడుకునేందుకు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత వ్యాక్సిన్లు రావడంతో క్రమంగా లాక్ డౌన్లను ఎత్తివేయగా, ప్రజలు సాధారణ జీవనంలోకి మళ్లీ అడుగుపెట్టారు.

అయితే, కాకినాడ జిల్లా గాజులూరు మండలం కుయ్యేరులో ఓ తల్లి, కూతురు మాత్రం కరోనా భయంతో ఇప్పటికీ ఇల్లు దాటి బయటికి రావడంలేదు. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి వారిద్దరూ ఇంటికే పరిమితమయ్యారు. 

తల్లి పేరు మణి, కుమార్తె పేరు దుర్గాభవాని. ఇల్లు దాటి బయటికి వస్తే కరోనా కాటేస్తుందని వారు హడలిపోతున్నారు. కరోనా తీవ్రత తగ్గినా, వారిలో భయం మాత్రం పోలేదు. ఎవరన్నా వస్తే, దుప్పటికప్పుకుని కిటికీలోంచి మాట్లాడేవారు. ఇన్నాళ్లు మణి భర్త వారికి అన్నపానీయాలు అందిస్తున్నారు. అయితే వారం రోజుల నుంచి తనను కూడా వారిద్దరూ గదిలోకి రానివ్వడంలేదని ఆయన ఇతరులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

కాగా, మణి ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిసింది. దాంతో ఆ తల్లి, కూతురిని కాపాడేందుకు వైద్య ఆరోగ్య సిబ్బంది రంగంలోకి దిగారు. వారికి ఎంత నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా, బయటకి వచ్చేందుకు ససేమిరా అంటున్నారు. తల్లి మణి దుప్పటి సగం తొలగించి మాట్లాడుతుండగా, కుమార్తె దుర్గాభవాని మాత్రం దుప్పటిలోంచి తల కూడా బయట పెట్టడంలేదు. 

ఎట్టకేలకు మీడియా కూడా ఆ ఇంట్లోకి ప్రవేశించడంతో కుమార్తె మణి దుప్పటి తొలగించి మాట్లాడింది. తమకు చేతబడి చేశారని వారు అంటుండడంతో, వారి మానసిక పరిస్థితి బాగా దెబ్బతిన్నదని భావిస్తున్నారు. ఆసుపత్రిలో చేరితే చికిత్స చేస్తామని వైద్య ఆరోగ్య సిబ్బంది చెబుతున్నా వారు మొండికేస్తున్నారు. తీవ్ర ప్రయత్నాల అనంతరం అధికారులు, పోలీసులు వారిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు.

  • Loading...

More Telugu News