Samantha: సమంత పరిస్థితిపై వివరణ ఇచ్చిన ప్రతినిధులు

Representatives explains Samantha situation
  • మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత
  • సినిమాలకు దూరం కానుందంటూ ప్రచారం
  • ఆ కథనాల్లో వాస్తవంలేదన్న సమంత ప్రతినిధులు
  • సంక్రాంతి తర్వాత షూటింగుల్లో పాల్గొంటుందని వెల్లడి  
ప్రముఖ నటి సమంత మయోసైటిస్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె ఆరోగ్యం బాగా క్షీణించిందని, సినిమాలకు దూరం కానుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై సమంత ప్రతినిధులు స్పందిస్తూ, జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. సమంత ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న కథనాల్లో నిజంలేదని స్పష్టం చేశారు. 

ప్రస్తుతం సమంత విశ్రాంతి తీసుకుంటున్నట్టు వెల్లడించారు. సంక్రాంతి తర్వాత మళ్లీ షూటింగులకు హాజరవుతారని వెల్లడించారు. మొదట విజయ్ దేవరకొండతో ఖుషి షూటింగ్ పూర్తిచేస్తారని, ఆ తర్వాత ఏప్రిల్, మే నెలల్లో బాలీవుడ్ ప్రాజెక్టులపై దృష్టిసారిస్తారని వివరించారు. 

ఓ బాలీవుడ్ చిత్రం షూటింగులో జనవరి నుంచే పాల్గొనాల్సి ఉన్నా, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని సమంత ప్రతినిధులు పేర్కొన్నారు. ఆ సినిమా ఆర్నెల్లు వాయిదా పడే అవకాశం ఉందని తెలిపారు. అంతేతప్ప, ఇప్పటివరకు అంగీకరించిన ఏ ప్రాజెక్టు నుంచి సమంత తప్పుకోవడంలేదని స్పష్టం చేశారు. 

సమంత కోసం వేచిచూడడం ఇబ్బందికరం అనుకుంటే షెడ్యూల్ ప్రకారమే షూటింగ్ జరుపుకోవాలని ఇప్పటికే క్లారిటీ ఇచ్చామని ప్రతినిధులు వివరించారు. సమంత తాజాగా కొత్త ప్రాజెక్టులేవీ ఒప్పుకోవడంలేదని వెల్లడించారు.
Samantha
Health
Shootings
Cinemas

More Telugu News