Exercise: వ్యాయామం ఓ అలవాటుగా చేసుకోండిలా..!
- తేలికపాటి కసరత్తులతో మొదలు పెట్టాలి..
- వ్యాయామానికి మంచి భాగస్వామి ఉంటే మరింత మేలు
- రోజూ ఒకే సమయంలో చేయడం మంచిదంటున్న నిపుణులు
శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తుంటారు. వైద్యులు చెప్పారు కదా అని వ్యాయామం మొదలెట్టిన వాళ్లలో చాలామంది కొన్ని రోజులు, వారాలు చేసి మానేస్తుంటారు. అలా కాకుండా రోజువారీ పనుల్లో వ్యాయామాన్ని తప్పనిసరిగా చేర్చాలని, అప్పుడే ఫలితం కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు. ఆరంభ శూరత్వం కాకుండా నిత్యజీవితంలో వ్యాయామాన్ని భాగం చేసుకోవడానికి కొన్ని చిట్కాలు చెబుతున్నారు. అవేంటంటే..
తొలినాళ్లలో తేలికపాటి వ్యాయామం చేయాలని, నెమ్మదిగా వ్యాయామంలో తీవ్రతను పెంచుకుంటూ పోవాలని సూచిస్తున్నారు. బరువులెత్తే విషయమే తీసుకుంటే.. ప్రారంభంలో తక్కువ స్థాయి నుంచి క్రమంగా బరువును పెంచుకుంటూ పోవాలంటున్నారు. రోజురోజుకూ బరువు పెంచుకుంటూ పోతే ఒళ్లు నొప్పులతో వ్యాయామానికి డుమ్మా కొట్టడం, ఆపై అటకెక్కించడం జరుగుతుందని నిపుణులు వివరించారు.
నడక, పరుగు, ఇండోర్ జిమ్.. ఇలా చేసే వ్యాయామం ఏదైనా సరే మంచి భాగస్వామిని తోడుగా ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. జీవిత భాగస్వామి కావొచ్చు స్నేహితుడు కావొచ్చు.. ఎవరైనా తోడుగా ఉంటే వ్యాయామం చేయాలన్న ఆసక్తి పెరుగుతుందంటున్నారు. ఒకవేళ మీరు బద్ధకించినా మీ భాగస్వామి మిమ్మల్ని వ్యాయామం చేసేలా చూస్తారని చెప్పారు.
ఉద్యోగ బాధ్యతలో వ్యాపారంలో బిజీ వల్లనో.. కారణం ఏదైనా సరే రోజువారీ వ్యాయామానికి అప్పుడప్పుడూ అవాంతరం కలిగిస్తాయి. అలాంటి సందర్భాలలో రోజూ చేస్తున్నట్లు వ్యాయామం చేయలేకపోయినా చిన్నగా నాలుగు అడుగులు అటూ ఇటూ వేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం అసలే చేయనివాళ్లు కూడా ఇలా చేయడం వల్ల ఆరోగ్యంపై కొంత ప్రభావం కనిపిస్తుందని వివరించారు.
వ్యాయామం అంటే బోర్ అనుకునేవాళ్లు నచ్చిన వ్యాయామాన్ని ఎంచుకోవచ్చు. వ్యాయామం అంటే బరువులెత్తడం మాత్రమే కాదు.. ఈత, డ్యాన్స్, సైకిల్ తొక్కడం, యోగా.. ఇలా ఏది నచ్చితే అది చేయొచ్చు. అయితే, రోజూ చేయడం ముఖ్యమని అంటున్నారు. శరీరంలో అన్ని అవయవాలనూ కదిలించేలా చూడాలని చెబుతున్నారు.
ఇక అన్నింటికన్నా ముఖ్యమైన సూచన ఏంటంటే.. రోజూ వ్యాయామం చేయమన్నారు కదా అనిచెప్పి, ఏ టైమ్ లో చేస్తే ఏంటని భావించకుండా రోజూ ఒకే టైంలో నిర్ణీత సమయం పాటు వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల వ్యాయామం మీ జీవితంలో ఓ భాగమైపోతుందని చెబుతున్నారు.