IMA: భారత్ లోనూ బీఎఫ్-7... ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఐఎంఏ

IMA alerts citizens over BF7 Corona variant in India
  • చైనాలో కరోనా ఉగ్రరూపం
  • అమెరికా, జపాన్, కొరియాలోనూ తీవ్రస్థాయిలో కొత్త కేసులు
  • భారత్ లో ఆందోళన
  • భారత్ లో పరిస్థితి అదుపులోనే ఉందన్న ఐఎంఏ
  • అయినప్పటికీ ప్రజలు, ప్రభుత్వం సన్నద్ధంగా ఉండాలని సూచన

చైనాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో భారత్ లోనూ ఆందోళనలు నెలకొన్నాయి. చైనాలో కరోనా ఉద్ధృతికి కారణమైన ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ భారత్ లోనూ వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రజలను అప్రమత్తం చేసింది. తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది.

గత 24 గంటల వ్యవధిలో అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, బ్రెజిల్ వంటి దేశాల్లో 5.37 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని ఐఎంఏ వెల్లడించింది. గత 24 గంటల్లో భారత్ లో 145 పాజిటివ్ కేసులు నమోదైతే, వాటిలో నాలుగు కేసులు బీఎఫ్-7 వేరియంట్ కు చెందినవని వివరించింది. 

అయితే దేశంలోని భారీ మౌలిక సదుపాయాలు, ప్రైవేటు రంగం వనరులు, అంకితభావంతో కూడిన వైద్య సిబ్బంది, క్రియాశీలక నాయకత్వం, తగినన్ని ఔషధాలు, వ్యాక్సిన్లతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సత్తా భారత్ కు ఉందని ఐఎంఏ పేర్కొంది. గతంలో ఇది నిరూపితమైందని తెలిపింది. 

దేశంలో ఇప్పటికిప్పుడు ప్రమాదకర పరిస్థితులేవీ లేవని, ఆందోళన చెందాల్సిన పనిలేదని ఐఎంఏ అభిప్రాయపడింది. అయినప్పటికీ కేంద్రం 2021లో మాదిరే తగిన సన్నద్ధతతో సిద్ధంగా ఉండాలని, గతంలో కంటే అధికస్థాయిలో సన్నాహకాలు ఉండాలని సూచించింది. కరోనా ఒక్కసారిగా విజృంభించకముందే జాగ్రత్తపడడం మంచిదని పేర్కొంది. 

ఇక ప్రజలకు ఐఎంఏ పలు సూచనలు చేసింది.

1. అన్ని బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.
2. భౌతికదూరం పాటించాలి.
3. సబ్బుతోనూ, శానిటైజర్లతోనూ క్రమం తప్పకుండా చేతులు శుభ్రం చేసుకోవాలి.
4. వివాహాలు, రాజకీయ, సామాజిక సమావేశాలకు దూరంగా ఉంటే మంచిది.
5. అంతర్జాతీయ ప్రయాణాలు చేయరాదు.
6. జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
7. వ్యాక్సిన్ తీసుకోనివారు వెంటనే కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోండి.
8. ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించండి.


IMA
Corona Virus
BF-7
Omicron Variant
India
China

More Telugu News