BF7 variant: చైనీయులను వణికిస్తున్న బీఎఫ్ 7 వేరియంట్.. 91 దేశాల్లో ఉన్నదే ఇది!
- 2021 ఫిబ్రవరి నుంచి పలు దేశాల్లో వ్యాపిస్తున్న రకం ఇదే
- ఆయా దేశాల్లో కరోనా వ్యాప్తి చాలా తక్కువ
- చైనాలో భిన్నమైన పరిస్థితుల వల్లే వైరస్ వేగంగా విస్తరణ
చైనాలో ఇప్పుడు శరవేగంగా విస్తరిస్తున్న కరోనా కేసులకు బీఎఫ్7 ఒమిక్రాన్ ఉప రకం కారణం. ఇది ఇప్పటికే 91 దేశాల్లో రెండేళ్లుగా విస్తరణలో ఉన్న రకమే కావడం గమనార్హం. మరి ఆయా దేశాల్లో దీని కారణంగా చైనాలో మాదిరి భయానక పరిస్థితులు ఏవీ లేవన్నది నిజం. స్క్రిప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఇందుకు సంబంధించి గణాంకాలను విడుదల చేసింది.
91 దేశాల్లో బీఎఫ్ 7 మాదిరి జన్యు సంబంధ, మ్యుటేషన్ ప్రొఫైల్ ను పోలిన రకం 2021 ఫిబ్రవరి నుంచి విస్తరణలో ఉందని, అంతిమంగా దీనికి బీఎఫ్ 7గా (బీఏ.5.5.1.7) పేరు నిర్ధారించినట్టు స్క్రిప్స్ రీసెర్చ్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా దీని వ్యాప్తి రేటు 0.5 శాతంగానే ఉన్నందున హెచ్చరికలను పునరుద్ధరించడం అర్ధరహితమని వైరాలజిస్టులు, ఎపిడెమాలజిస్టులు, అంటు వ్యాధుల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
‘‘ఎన్నో దేశాలలో 22 నెలలుగా బీఎఫ్ 7 వేరియంట్ ఉన్నప్పటికీ, కరోనా కేసులు గణనీయంగా పెరగలేదు. దీని వ్యాప్తి రేటు 0.5 శాతంగానే ఉన్నందున, దీనికి పరిమిత వృద్ధి సామర్థ్యమే ఉన్నట్టు తెలుస్తోంది’’ అని ఓ వైరాలజిస్ట్ పేర్కొన్నారు. మన దేశంలో బీఏ.5 (దీన్నుంచి వచ్చిన ఉప రకమే బీఎఫ్ 7) సైతం తక్కువ వ్యాప్తినే కలిగించింది. మరి చైనాలో అంత తీవ్రత ఎందుకంటే.. అక్కడి ప్రజల్లో కరోనా ఇన్ఫెక్షన్ రేటు తక్కువగా ఉండడం, టీకాల తక్కువ సమర్థత, ఒక్కసారిగా జీరో కోవిడ్ పాలసీ ఎత్తివేయడం వల్లేనన్న విశ్లేషణను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.