India: చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో.. రూ.84 వేల కోట్లతో ఆయుధ సంపత్తి పెంచేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- ఆయుధాలు, ఇతర రక్షణ సామగ్రి కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం
- మొత్తం 24 ప్రాజెక్టులకు సత్వర అంగీకారం తెలిపిన వైనం
- 97 శాతం స్వదేశంలోనే సమకూర్చుకోవాలని నిర్ణయం
సరిహద్దులో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత సైన్యం తన ఆయుధ సంపత్తిని మరింత పెంచుకోనుంది. త్వరితగతిన భారీగా ఆయుధాలు కొనుగోలు చేయడానికి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఏకంగా రూ.84,328 కోట్లతో ఆయుధాలు, ఇతర రక్షణ సామగ్రిని కొనుగోలు చేయాలని నిర్ణయించింది. లైట్ ట్యాంకులు, ఫ్యూచరిస్టిక్ పోరాట వాహనాలు, మౌంటెడ్ గన్ సిస్టమ్స్, క్షిపణులు, బాంబులతో సహా కొత్త మిలిటరీ హార్డ్ వేర్‌తో భారత సాయుధ దళాల పోరాట సామర్థ్యాన్ని పెంపొందించేందుకు రక్షణ ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది.
ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ఆయుధ సేకరణకు ప్రాధాన్యం ఇచ్చింది. చైనా సరిహద్దులో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి లైట్ ట్యాంకులు, మౌంటెడ్ గన్ సిస్టమ్‌లను మోహరించే అవకాశం కనిపిస్తోంది. కాగా, రక్షణ శాఖ ఆమోదం తెలిపిన 84 వేల కోట్ల పైచిలుకు విలువ చేసే ఆయుధాల్లో 97 శాతం దేశంలో రూపొందించినవే కాబోతుండడం విశేషం. మొత్తంగా 24 ప్రాజెక్టుల్లో రూ.82,127 కోట్ల విలువ చేసే 21 ప్రాజెక్టులను దేశీయంగానే సేకరించాలని నిర్ణయించింది. ఇది అత్మనిర్భర్ భారత్‌కు దోహద పడుతుందని రక్షణ శాఖ అభిప్రాయపడింది.