Kaikala: నవరస నట పాఠశాల .. కైకాల!
- తెలుగు తెరపై తిరుగులేని నటుడు కైకాల
- విలక్షణ పాత్రలతో సుదీర్ఘప్రయాణం
- ఎస్వీఆర్ తరువాత స్థానం ఆయనదే
- నేటి తెల్లవారు జామున తుది శ్వాస విడిచిన కైకాల
- అశ్రు నివాళులు అర్పిస్తున్న అభిమానులు
కైకాల సత్యనారాయణ పేరు చెప్పగానే గంభీరమైన రూపం .. అందుకు తగిన స్వరం .. ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోయే తీరు కళ్లముందు కదలాడతాయి. ఆయన బాడీ లాంగ్వేజ్ .. డిఫరెంట్ గా ఉండే డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెరపై అటు అగ్నిపర్వతం వంటి పాత్రలను .. ఇటు మంచు పర్వతం వంటి పాత్రలను పోషించి, నవరస నట సార్వభౌముడు అనిపించుకున్నవారాయన. నిప్పుల వర్షం కురిపించే పాత్రలలోనే కాదు, ఫక్కున నవ్వించే పాత్రలలోను ఇష్టంగా ఇమిడిపోయినవారాయన.
1950లలో కృష్ణాజిల్లా నుంచి 'మద్రాసు' వెళ్లినవారిలో కైకాల సత్యనారాయణ ఒకరు. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని 'కౌతవరం' అనే చిన్న గ్రామంలో ఆయన పుట్టిపెరిగారు. ఆయన చదువంతా కూడా గుడివాడ - విజయవాడలలో కొనసాగింది. చదువుకునే రోజుల్లోనే కైకాలకి నాటకాల పట్ల ఆసక్తి పెరుగుతూ పోయింది. స్నేహితులతో కలిసి నాటకాలు ఆడుతూనే, డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత స్నేహితుల ప్రోత్సాహంతో నటుడు కావాలనే ఉద్దేశంతో మద్రాసుకు వెళ్లారు.
సినిమాల్లో అవకాశాలు లభించడం అనుకున్నంత తేలిక కాదనే విషయం ఆయనకి అర్థమైంది. ఒక చిన్నగదిలో అద్దెకి ఉంటూ ఆయన తన ప్రయత్నాలు మొదలుపెట్టారు. సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ తన ఫొటోలు ఇవ్వడం మొదలుపెట్టారు. మంచి ఒడ్డూ పొడుగూ ఉండటం వలన ఆయనకి ఎక్కడా కూడా అవమానాలు ఎదురుకాలేదు. కానీ అవకాశాల కోసం ఎదురుచూసి .. చూసి ఆయనకి విసుగు వచ్చేసింది. ఇక వెనక్కి వెళ్లిపోవడమే మంచిదని ఆయన అనుకుంటున్న సమయంలో 'సిపాయి కూతురు' సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది.
కైకాల తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ సినిమా హిట్ అయితే ఇక తాను ఇండస్ట్రీలో కుదురుకున్నట్టేనని అనుకున్నారు. కానీ ఆ సినిమా పరాజయం పాలయింది. అవకాశాల విషయంలో ఆయన మళ్లీ మొదటికి వచ్చారు. ఒక సినిమాలో హీరోగా వేశారు గనుక .. ఇక ఇప్పుడు వెనక్కి కూడా వెళ్లలేని పరిస్థితి. అలాంటి సమయంలోనే ప్రతినాయకుడి వేషాల కోసం ట్రై చేయమని ఆయనకి విఠలాచార్య సలహా ఇచ్చారు. ఆయన రూపం అందుకు బాగా నప్పుతుందని ధైర్యం చెప్పారు.
అంతేకాదు తన సినిమా అయిన 'కనదుర్గ పూజా మహిమ' సినిమాలో కైకాలకు విలన్ వేషం ఇచ్చారు. అలా ప్రతినాయకుడిగా ఆ సినిమాతో ఆయన ప్రయాణం మొదలైంది. ఆ తరువాత విఠలాచార్య ఎన్టీఆర్ తో 'అగ్గిపిడుగు' చేస్తూ మళ్లీ కైకాలనే విలన్ గా తీసుకున్నారు. ఆ సినిమా విలన్ గా కైకాలకు మంచి పేరు తీసుకుని రావడమే కాకుండా, ఎన్టీఆర్ తో సాన్నిహిత్యం పెరగడానికి కారణమైంది. అప్పటి నుంచి సాంఘిక చిత్రాలలోనే కాకుండా, జానపద .. చారిత్రక .. పౌరాణిక చిత్రాలలో ఆయనను ఎన్టీఆర్ ప్రోత్సహించారు.
ఒకానొక దశలో ఎన్టీఆర్ హీరో అయితే కైకాల విలన్ .. ఇక ఈ విషయంలో సందేహమే అవసరం లేదు అన్నట్టుగా వరుస సినిమాలు వచ్చాయి. పౌరాణికాలలో కైకాల దుర్యోధనుడు .. కర్ణుడు .. దుశ్శాసనుడు .. మేఘనాథుడు .. భరతుడు .. రావణుడు .. యముడు .. ఘటోత్కచుడు వంటి పాత్రలను పోషించి మెప్పించారు. నటనలో తన వారసుడు కైకాల అని ఎస్వీ రంగారావు స్వయంగా ప్రకటించారు. ఇక ఎస్వీ రంగారావు తరువాత పౌరాణిక పాత్రల్లో ప్రతినాయకుడిగా కైకాల తప్ప మరొకరు సెట్ కారని ప్రేక్షకులు అనుకున్నారు.
రావణుడు .. దుర్యోధనుడు .. యముడు .. ఘటోత్కచుడు వంటి పాత్రలను కైకాల ప్రదర్శించిన హావభావ విన్యాసాలు చూస్తే అది నిజమేనని అనిపిస్తుంది. ఇక ఎన్టీఆర్ చాలా బిజీగా ఉన్న సమయంలో ఆయనకి డూప్ గా కైకాల చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక తన సొంత బ్యానర్లో ఎన్టీఆర్ ఏదైనా సినిమా మొదలుపెడితే, అందులో ఏ పాత్ర కావాలో ఎంచుకోమని కైకాలతో అనేవారట. వాళ్లిద్దరి కాంబినేషన్లో 100కి పైగా సినిమాలు వచ్చాయంటే, వాళ్ల మధ్య ఏ స్థాయి సాన్నిహిత్యం ఉండేదనేది అర్థం చేసుకోవచ్చు.
5 దశాబ్దాలకి పైగా నటుడిగా సుదీర్ఘమైన ప్రయాణాన్ని కొనసాగించిన ఆయన, దగ్గర దగ్గరగా 800 సినిమాల వరకూ చేశారు. ఎస్వీఆర్ కి ప్రత్యామ్నాయంగా కైకాల కనిపిస్తూ వచ్చారు. కానీ ఇక కైకాలకు ప్రత్యామ్నాయం లేరనే చెప్పాలి. అలాంటి కైకాల ఇక లేరనేది జీర్ణించుకోలేని విషయం. ఆయన అభిమానులను కన్నీళ్ల పర్యంతం చేసే విషాదకరమైన సంఘటన. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, అశ్రునివాళులు అర్పిద్దాం.