Joe Root: ఐపీఎల్ వేలం: జో రూట్ ను కోటి రూపాయలకు కొనుక్కున్న రాజస్థాన్ రాయల్స్
- కొచ్చిలో ఐపీఎల్ ఆటగాళ్ల మినీ వేలం
- తొలి రౌండ్ లో అన్ సోల్డ్ గా మిగిలిన రూట్
- తదుపరి రౌండ్ లో ఆసక్తి చూపించిన రాజస్థాన్
- రూట్ ను కనీస ధరకే దక్కించుకున్న వైనం
ఐపీఎల్ ఆటగాళ్ల మినీ వేలం తొలి రౌండ్ లో అమ్ముడు కాకుండా మిగిలిపోయిన ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్ మన్ జో రూట్ కు తదుపరి రౌండ్ లో గిరాకీ తగిలింది. ఓ దశలో రూట్ పై ఎవరూ ఆసక్తి చూపకపోగా... చివరికి రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. అది కూడా రూట్ ను కనీస ధరకే కొనుగోలు చేసింది. రూట్ ధర రూ.1 కోటి కాగా, అదే రేటుకు అతడిని దక్కించుకుంది.
ఇక, బంగ్లాదేశ్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్ ను రూ.1.5 కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. అటు, ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా ను రూ.1.5 కోట్ల ధరతో రాజస్థాన్ రాయల్స్ కొనేసింది. ఆఖరి రౌండ్ లో దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ రిలీ రూసో జాక్ పాట్ కొట్టేశాడు. రూసోను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.4.6 కోట్లకు కొనుగోలు చేసింది.
కాగా, ఇంగ్లండ్ కుర్ర ఆల్ రౌండర్ శామ్ కరన్ రూ.18.50 కోట్లతో చరిత్ర సృష్టించగా, అతడి సోదరుడు టామ్ కరన్ ను ఒక్కరూ కొనుగోలు చేయలేదు. దేశవాళీ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డిని సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.