Tollywood: అవకాశాలిస్తామని తనను మోసం చేశారంటున్న హీరో నిఖిల్!

Nihkil siddarth says that he was cheated in the career begining
  • రూ. 50 లక్షలు ఇస్తే హీరోను చేస్తామంటే 5 లక్షలు ఇచ్చానన్న నిఖిల్ సిద్ధార్థ్  
  • రూ. లక్షతో షూటింగ్ చేసి తర్వాత ఆపివేయడంతో మోసపోయానని గ్రహించినట్టు వెల్లడించిన యువ హీరో
  • శేఖర్ కమ్ముల ‘హ్యాపీడేస్’లో అవకాశం ఇవ్వడంతో ఈ స్థాయికి వచ్చానని వ్యాఖ్య
సినీ హీరోలు, హీరోయిన్ల జీవితం తెరపై ఎంతో అందంగా, అద్భుతంగా కనిపిస్తుంది. కానీ, తెర వెనుక వాళ్లు ఎన్నోకష్టాలు ఎదుర్కుంటారు. వాళ్ల జీవితాల్లోనూ ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. అస్సలు నిలకడలేని ప్రయాణం వాళ్లది. బయటి ప్రపంచం మాదిరి సినీ ఇండస్ట్రీలోనూ ఎంతో మంది మోసగాళ్లు ఉంటారు. అవకాశాల పేరిట వర్దమాన నటీనటులు, సాంకేతిక నిపుణులను నిలువునా దోచుకుంటారు. కార్తికేయ2 చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారిన నిఖిల్ సిద్ధార్థ్ కూడా ఇలాంటి మోసగాళ్ల బారిన పడ్డాడు. ఈ విషయాన్ని నిఖిల్ స్వయంగా వెల్లడించాడు. తన తాజా చిత్రం ’18 పేజెస్’ ప్రమోషన్స్ లో భాగంగా కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లడించాడు. 

శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీడేస్ చిత్రంతో పరిచయం అయిన నిఖిల్ అంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఆ తర్వాత ఓ సీరియల్ కూడా చేశానని నిఖిల్ చెప్పాడు. బుల్లితెరపైనే ఉంటే తన కల నిజం కాదని, సినిమాల కోసం ఆడిషన్స్ ఇవ్వడం మొదలు పెట్టాడు. తన నటన నచ్చినా కొందరు అవకాశాలు ఇవ్వలేదని తెలిపాడు. రూ. 50 లక్షలు ఇస్తే హీరోను చేస్తామని కొందరు చెప్పడంతో 5 లక్షలు ఇచ్చానని నిఖిల్ వెల్లడించాడు. కానీ, అందులో రూ. లక్ష ఖర్చుతో షూటింగ్ చేసి తర్వాత ఆపివేయడంతో తాను మోసపోయానని తెలుసుకున్నానని నిఖిల్ తెలిపాడు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ లో అవకాశం ఇవ్వడంతో నిలదొక్కుకోగలిగానని చెప్పాడు. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో తనకు ఆదరణ లభిస్తోందన్నాడు. కానీ, గతం గుర్తు చేసుకుంటే ఇది నమ్మబుద్ధి కావడం లేదని నిఖిల్ చెప్పాడు.
Tollywood
hero
nikhil siddarth
pan india
cheated
career
karthikeya2

More Telugu News