Hyderabad: రాజీవ్ స్వగృహ టవర్లను అమ్మేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. నోటిఫికేషన్ విడుదల
- గతంలో ఫ్లాట్లు విక్రయించిన తెలంగాణ ప్రభుత్వం
- ఈసారి పనులు పూర్తికాని టవర్ల విక్రయానికి నోటిఫికేషన్
- టవర్ మొత్తం వ్యయంలో రెండు శాతం ఈఎండీగా సమర్పించాలన్న రాజవ్ స్వగృహ కార్పొరేషన్
- జనవరి 30 చివరి గడువు
రాజీవ్ స్వగృహ ప్లాట్లను గతంలో విక్రయించిన తెలంగాణ ప్రభుత్వం ఈసారి ఏకంగా టవర్లనే అమ్మకానికి పెట్టింది. హైదరాబాద్లోని పోచారం, గాజులరామారంలో పనులు పూర్తికాని రాజీవ్ స్వగృహ టవర్ల విక్రయానికి సంబంధించి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. పోచారంలో నాలుగు, గాజుల రామారంలో 5 టవర్లను విక్రయించనున్నట్టు నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది.
పోచారంలో ఒక్కో టవర్లో 72 నుంచి 198 ఫ్లాట్లు ఉండగా, గాజుల రామారంలో ఒక్కో టవర్లో 112 ఫ్లాట్లు ఉన్నాయి. కొనుగోలుకు ఆసక్తి ఉన్న వ్యక్తులు, సంస్థలు టవర్ మొత్తం వ్యయంలో రెండు శాతం ఈఎండీ సమర్పించాలని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తెలిపింది. ఈఎండీ సమర్పించేందుకు జనవరి 30ని చివరి తేదీగా పేర్కొంది. టవర్ల వివరాలు, పూర్తి సమాచారం కోసం www.hmda.gov.in, www.swagruha.telangana.gov.in ను సంప్రదించవచ్చు.