Bomb cyclone: అమెరికాలో స్తంభించిన జనజీవనం.. క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఇళ్లకే పరిమితం
- బాంబ్ సైక్లోన్ ప్రభావంతో తీవ్ర ప్రతికూల ఉష్ణోగ్రతలు
- వార్మింగ్ సెంటర్లను తెరిచిన యంత్రాంగం
- 25 కోట్ల మంది ప్రజలకు వాతావరణ హెచ్చరికలు
అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ప్రజలకు ఈ ఏడాది క్రిస్మస్ సంబరాలు దూరమయ్యాయి. తీవ్ర తుఫాను (బాంబ్ సైక్లోన్) కారణంగా ఇప్పటికి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. బలమైన గాలుల కారణంగా విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో కోట్లాది మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకట్లలో మగ్గాల్సిన పరిస్థితి ఎదురైంది.
సహాయక, పునరుద్ధరణ చర్యలకు ప్రతికూల వాతావరణం అవరోధంగా మారింది. ఉష్ణోగ్రతలు మైనస్ 45 డిగ్రీల వరకు పలు ప్రాంతాల్లో, మైనస్ 37డిగ్రీలు కొన్ని ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. న్యూయార్క్, టెనెస్సే, వాషింగ్టన్ డీసీల్లో మైనస్ 9 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. తీవ్ర ప్రతికూల వాతావరణంలో ప్రజలు పర్యటనలు, వేడుకలు రద్ధు చేసుకుని, ఇంటికే పరిమితమయ్యారు. ముఖ్యంగా శీతాకాలంలో బలమైన తుఫాను రాక అక్కడి జనజీవనాన్ని స్తంభింపజేసింది.
విమాన సర్వీసులను రద్దు చేయడంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. కొన్ని దశాబ్దాల్లోనే అత్యంత దారుణమైన తుఫానుగా దీన్ని పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా 24 కోట్ల మందికి వాతావరణంపై హెచ్చరికలు జారీ అయ్యాయి. గడ్డకట్టే ఉష్ణోగ్రతలు నెలకొనడంతో పోలీసు స్టేషన్లు, లైబ్రరీల్లో వార్మింగ్ సెంటర్లను తెరిచారు.