China: చైనా కొవిడ్ లెక్కల డాక్యుమెంట్ల లీక్.. 20 రోజుల్లో 25 కోట్ల కేసులు!

China to stop publishing daily Covid count as leaked document suggests 250 million fresh cases in just 20 days
  • ‘రేడియో ఫ్రీ ఆసియా’లో లీకైన డాక్యుమెంట్లు
  • నేటి నుంచి కొవిడ్ లెక్కలు బయటపెట్టబోమన్న చైనా 
  • చైనా జనాభాలో 17.65 శాతం కరోనా బాధితులుగా మారి ఉంటారని అంచనా
  • లీకైన గణాంకాలు నిజమైనవేనన్న సీనియర్ జర్నలిస్ట్
చైనాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజు లక్షలాది కేసులు వెలుగు చూస్తున్నాయి. ఆసుపత్రుల్లోని ఐసీయూ రూములు, శ్మశానాలు రద్దీగా మారాయి. దీంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చైనా ప్రభుత్వం రోజువారీ కరోనా లెక్కలను వెల్లడించడం మానేసింది. అయితే, ఎందుకు మానేసిందన్న విషయాన్ని వెల్లడించలేదు.  

ఆదివారం నుంచి కరోనా కేసుల లెక్కలను వెల్లడించబోమని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ తాజాగా పేర్కొంది. దేశంలో గత 20 రోజుల్లో 25 కోట్ల మంది కరోనా బారినపడి ఉండొచ్చని తాజాగా లీకైన డాక్యుమెంట్లను బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేషనల్ హెల్త్ కమిషన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. కాగా, ఇప్పటి వరకు ‘జీరో కొవిడ్’ విధానాన్ని అనుసరిస్తూ వచ్చిన చైనా ఒక్కకేసు వెలుగు చూసినా లాక్‌డౌన్‌లు, ఆంక్షలు విధిస్తూ వచ్చింది. అయితే, లాక్‌డౌన్‌లకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలకు దిగడంతో ఆంక్షలు, లాక్‌డౌన్‌లు ఎత్తేసింది. దీంతో ఆ తర్వాత కేసులు ఒక్కసారిగా ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి.  

‘రేడియో ఫ్రీ ఆసియా’ లీక్ చేసిన ప్రభుత్వ డాక్యుమెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత 20 రోజుల్లో దాదాపు 250 మిలియన్ల మంది కరోనా బారినపడి ఉంటారని అవి చెబుతున్నాయి. ఈ నెల 1 నుంచి 20 మధ్య దాదాపు 248 మిలియన్ల మంది లేదా చైనా జనాభాలో 17.65 శాతం మంది కరోనా బాధితులుగా మారి ఉంటారని డాక్యుమెంట్లు స్పష్టం చేస్తున్నాయి. ఈ డాక్యుమెంట్లలో ఉన్న గణాంకాలు నిజమైనవేనని సీనియర్ జర్నలిస్టు ఒకరు‘రేడియో ఫ్రీ ఆసియా’తో పేర్కొన్నారు. ప్రభుత్వ సమావేశానికి హాజరైన వారు ఈ డాక్యుమెంట్లను లీక్ చేసి ఉంటారని పేర్కొన్నారు. 

వచ్చే ఏడాది నాటికి చైనాలో రెండు మిలియన్ల మరణాలు సంభవించొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాలో చెలరేగిపోతున్న ఇన్ఫెక్షన్లకు బీఎఫ్.7 వేరియంటే కారణమని చెబుతున్నారు. ఈ వేరియంట్ తీవ్ర ముప్పునకు కారణం అవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
China
COVID19
Corona Virus
Lockdown
Corona Cases

More Telugu News