Gudivada: టీడీపీ కార్యాలయానికి నిప్పంటించే యత్నం.. గుడివాడలో ఉద్రిక్తత
- వంగవీటి రంగా వర్ధంతికి టీడీపీ సన్నాహాలు
- నిర్వహించొద్దని రావి వెంకటేశ్వరరావుకు కొడాలి నాని ముఖ్య అనుచరుడు కాళి ఫోన్
- పెట్రోలు ప్యాకెట్లతో టీడీపీ కార్యాలయం వద్దకు వైసీపీ కార్యకర్తలు
- టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్
- టీడీపీ అధికారంలోకి వస్తే తొలుత పారిపోయేది నానియేనన్న అచ్చెన్నాయుడు
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైకి వైసీపీ కార్యకర్తలు పెట్రోలు ప్యాకెట్లు విసిరి నిప్పటించే ప్రయత్నం చేయడంతో గుడివాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత రాత్రి నుంచి పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు కర్రలు, కత్తులతో దాడిచేసి భయభ్రాంతులకు గురిచేశారు. నాని ముఖ్య అనుచరుడైన మెరుగుమాల కాళి ఆధ్వర్యంలో ఈ ఘటన జరిగినట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఘటన జరిగినప్పుడు పోలీసులు అక్కడే ఉన్నా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.
గుడివాడలో నేడు వంగవీటి రంగా వర్ధంతి నిర్వహించేందుకు టీడీపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో నాని అనుచరుడైన కాళి టీడీపీ గుడివాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావుకు ఫోన్ చేసి రంగా వర్ధంతి నిర్వహించొద్దని హెచ్చరించినట్టు చెబుతున్నారు. ఆ విషయం చెప్పడానికి నువ్వెవరని వెంకటేశ్వరరావు ప్రశ్నించడంతో కాళి తనను తీవ్ర స్వరంతో హెచ్చరించినట్టు వెంకటేశ్వరరావు ఆరోపించారు. అసభ్య పదజాలాన్ని ఉపయోగించడమే కాకుండా ఎక్కువ మాట్లాడితే తనను లేపేస్తానని బెదిరించాడని రావి పేర్కొన్నారు.
మరోవైపు, విషయం తెలిసిన రావి వర్గీయులు టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి కాళి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అదే సమయంలో కార్యకర్తలతో కలిసి కాళి అక్కడకు చేరుకున్నారు. టీడీపీ కార్యాలయంపైకి పెట్రోలు ప్యాకెట్లు విసిరి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. కర్రలు, కత్తులతో దాడిచేశారు. టీడీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. వైసీపీ నాయకులను అక్కడి నుంచి పంపించి వేశారు.
నాని కాపాడతాడని విర్రవీగుతున్నారు: రావి
ఈ ఘటనపై రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని, వైసీపీ గూండాలను చెదరగొట్టకుండా తమపైనే లాఠీచార్జ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. తాము ఎలాంటి అరాచకాలకు పాల్పడినా కొడాలి నాని కాపాడతాడని వారందరూ విర్రవీగుతున్నారని, వారందరికీ సమయం దగ్గర పడిందని హెచ్చరించారు. రంగా వర్ధంతిని నిర్వహించి తీరుతామని రావి తేల్చి చెప్పారు.
పోలీసుల చేతకాని తనానికి నిదర్శనం: అచ్చెన్న
గుడివాడ ఘటనపై టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. రావి వెంకటేశ్వరరావును హతమారుస్తామని గడ్డం గ్యాంగ్ బహిరంగంగా హెచ్చరించినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడ్డం గ్యాంగును బతిమాలడం పోలీసుల చేతకాని తనానికి నిదర్శనమన్నారు. రంగాను చంపడంలో తప్పులేదన్న గౌతంరెడ్డికి ఫైబర్ నెట్ చైర్మన్ పదవిని ఇచ్చిన వ్యక్తి జగన్ మోహన్‌రెడ్డి అని మండిపడ్డారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తొలుత పారిపోయేది నానియేనని అచ్చెన్నాయుడు అన్నారు.