Droupadi Murmu: ప్రత్యేక హెలికాప్టర్ లో శ్రీశైలం చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో రాక
- సున్నిపెంట వద్ద స్వాగతం పలికిన ఏపీ మంత్రులు
- శ్రీశైలంలో సాక్షి గణపతి ఆలయంలో పూజలు చేసిన ముర్ము
- 'ప్రసాద్' పథకంలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం విచ్చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఆమె సున్నిపెంట సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద ద్రౌపది ముర్ముకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
అనంతరం ముర్ము రోడ్డు మార్గంలో శ్రీశైలం తరలి వెళ్లారు. అక్కడ సాక్షి గణపతి ఆలయంలో పూజలు నిర్వహించి, భ్రమరాంబిక అతిథి గృహానికి చేరుకున్నారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం... శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ వేదపండితులు, అధికారులు రాష్ట్రపతికి సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించిన ద్రౌపది ముర్ము, భ్రమరాంబిక అమ్మవారికి కుంకుమార్చన చేశారు.
ప్రత్యేక పూజల అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని దర్శించారు. ముర్ము తన పర్యటనలో భాగంగా 'ప్రసాద్' పథకంలో భాగంగా శ్రీశైలంలో రూ.43.08 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు.