YS Sharmila: ఇక్కడి రైతులను ఆదుకోని కమీషన్ రావు దేశాన్ని ఉద్ధరిస్తాడట: షర్మిల
- అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటే ఏంటో చెప్పాలన్న షర్మిల
- రుణమాఫీ ఎగ్గొట్టడం మీ నినాదమా అంటూ నిలదీత
- బర్బాత్ సర్కార్ అంటూ విమర్శలు
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తారు. 'అబ్ కీ బార్ కిసాన్ సర్కారు అంటే ఏమిటో జర చెప్పండి బీఆర్ఎస్ కేసీఆర్ గారూ' అంటూ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల్లో అగ్రస్థానంలో నిలపడం రైతుకు భరోసానా? ఒక్కో రైతు తలపై లక్షన్నర అప్పు పెట్టడం అభివృద్ధి అవుతుందా? 37 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టడం మీ బీఆర్ఎస్ నినాదమా? అంటూ షర్మిల నిలదీశారు.
"ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడమే కిసాన్ సర్కార్ అంటారా? సబ్సిడీ పథకాలను నిలిపివేయడమే రైతు సంక్షేమమా? ఒక చేత్తో రైతు బంధు ఇచ్చి, మరో చేత్తో వెనక్కి తీసుకోవడం రైతును ఆదుకున్నట్టా? ఉచిత ఎరువులు అని చెప్పి పంగనామాలు పెట్టడం, బ్యాంకుల ఎదుట రైతులను మోసగాళ్లను చేయడం, పంట నష్టపోతే ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం... ఇదేనా అబ్ కీ బార్ కిసాన్ సర్కార్?" అంటూ షర్మిల మండిపడ్డారు.
"మీది అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ కాదు... ఆప్ కీ బర్బాత్ సర్కార్! కన్నతల్లికి అన్నం పెట్టలేని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట. కేసీఆర్ దొర తీరు కూడా ఈ బంగారు గాజుల లెక్కనే ఉన్నది. ఇక్కడి రైతుల ఆత్మహత్యలు ఆగడంలేదు... పంటకు గిట్టుబాటు ధర రాదు, రుణమాఫీ జాడలేదు... కౌలు రైతుకు దిక్కేలేదు. రైతును అప్పులపాలు చేసి కోటీశ్వరులను చేశానని చెప్పే నీ బర్బాత్ సర్కారు మాటలు నమ్మే రోజులు పోయాయి. ఇక్కడి రైతులను ఆదుకోని కమీషన్ రావు దేశాన్ని ఉద్ధరిస్తాడట!" అంటూ కేసీఆర్ పై షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు.