Luna: వచ్చే ఏడాది వస్తున్న లూనా ఎలక్ట్రిక్ వెర్షన్
- గ్రామీణ ప్రాంతాల్లో లూనా ఫేమస్
- కొత్తరూపంలో వస్తున్న చిన్న బండి
- వచ్చే ఏడాది సెప్టెంబరు నుంచి విక్రయాలు
లూనా... ఈ పేరు భారతదేశ గ్రామీణ ప్రాంతాల వారికి సుపరిచితమే. ముఖ్యంగా, రైతులకు, చిన్న తరహా వ్యాపారులు, వీధుల వెంట తిరిగి విక్రయాలు సాగించే వారికి ఇది నమ్మదగిన నేస్తం. దశాబ్దాల తరబడి భారతీయులకు సేవలందించిన కైనెటిక్ లూనా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెర్షన్ లో వస్తోంది.
లూనా మాతృసంస్థ కైనెటిక్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (కేఈఎల్) తన అనుబంధ సంస్థ కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ ద్వారా వచ్చే ఏడాది సెప్టెంబరులో ఎలక్ట్రిక్ లూనాను మార్కెట్లోకి తీసుకురానుంది. అహ్మద్ నగర్ లోని ప్లాంట్ లో నెలకు 7,500 వేల యూనిట్లను, పూణే సమీపంలో కొత్తగా నెలకొల్పిన కొత్త ప్లాంట్ లో నెలకు 25 వేలకు పైబడి యూనిట్లను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ దిశగా రాబోయే నాలుగేళ్లలో రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీన్ని అందుబాటు ధరలో విక్రయించనున్నట్టు కేఈఎల్ వర్గాలు తెలిపాయి.