Sankranti: ఈ ఏడాది ఏపీలో సంక్రాంతి సెలవులు ఆరు రోజులే.. ఎప్పటి నుంచి అంటే!
- తెలంగాణలో మాత్రం సెలవులు ఐదు రోజులే
- జనవరి 11 నుంచి ఆంధ్రాలో, జనవరి 13 నుంచి తెలంగాణలో సంక్రాంతి పండుగ సెలవులు
- మార్చి 15 నుంచి రెండు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు
సంక్రాంతి పండుగను ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ పండగకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. జనవరి 11 నుంచి 16 వరకు పండుగ సెలవులు, జనవరి 17న స్కూళ్లు తిరిగి తెరుచుకుంటాయని అధికారులు చెప్పారు. జూనియర్ కాలేజీలకు జనవరి 11 నుంచి 17 వరకు సెలవులు ఉంటాయన్నారు. అయితే, సంక్రాంతి సెలవులకు సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇక తెలంగాణలో మాత్రం ఈసారి సంక్రాంతి సెలవులు కేవలం ఐదు రోజులు మాత్రమేనని సమాచారం. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 13 నుంచి స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. తిరిగి జనవరి 18న స్కూళ్లు, కాలేజీలు తిరిగి తెరుచుకుంటాయని ప్రభుత్వ వర్గాల సమాచారం. శని, ఆదివారాల్లో పండుగ రావడంతో రెండు సెలవులను విద్యార్థులు మిస్ అవుతున్నారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.