Bharat Biotech: నాసల్ టీకా బూస్టర్ డోస్ ధర రూ.800
- ప్రైవేటులో ఇచ్చే టీకాలకే ఈ ధర
- దీనికి జీఎస్టీ, ఇతర చార్జీలు అదనం
- ప్రభుత్వ రంగంలో ఇచ్చే విషయమై లేని స్పష్టత
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా నాసల్ టీకా ఒక డోస్ ధర రూ.800గా నిర్ణయించొచ్చని తెలుస్తోంది. దీనికి అదనంగా 5 శాతం జీఎస్టీ చార్జీ, వ్యాక్సిన్ ఇచ్చినందుకు చార్జీ వసూలు చేయనున్నారు. ప్రైవేటులో తీసుకునే వారికి ఈ ధర అమలు చేయనున్నట్టు సమాచారం. రెండు రోజుల క్రితమే భారత్ బయోటెక్ నాసల్ టీకాను కేంద్ర సర్కారు బూస్టర్ డోస్ గా ఆమోదించడం తెలిసిందే. దీన్ని కోవిన్ యాప్ లో చేర్చారు. దీంతో కోవిన్ యాప్ ద్వారా సమీపంలోని వ్యాక్సినేషన్ కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. నాసల్ టీకాను ప్రభుత్వ రంగంలో ఉచితంగా ఇచ్చే విషయమై స్పష్టత లేదు.
ఈ నాసల్ టీకాను బీబీవీ154గా పిలుస్తున్నారు. 18 ఏళ్లు నిండిన వారు దీన్ని హెటోరోలోగస్ (వైవిధ్యమైన) బూస్టర్ డోస్ గా, అత్యవసర పరిస్థితుల్లో తీసుకునేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలియజేసింది. ‘‘టీకాల అభివృద్ధిలో భారత్ సామర్థ్యాలకు నాసల్ టీకా మరొక ఉదాహరణ. దీన్ని సులభంగా ఇవ్వొచ్చు. వైరస్ లు మన శరీరంలోకి ప్రవేశించే మార్గంలోనే రోగ నిరోధకత అడ్డుకునేలా ఇది చేస్తుంది. దీన్నొక ప్రికాషనరీ డోస్ గా ఆమోదించడం జరిగింది’’ అని టీకాలపై జాతీయ సాంకేతిక సలహా మండలి చైర్మన్ అయిన డాక్టర్ ఎన్కే ఆరోరా తెలిపారు.