House: ఈ ఇల్లు వెరీ వెరీ స్పెషల్... బెడ్రూం మహారాష్ట్రలో ఉంటే కిచెన్ తెలంగాణలో!
- మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లా మహరాజ్ గూడ గ్రామంలో ఇల్లు
- రెండు రాష్ట్రాల పరిధిలో ఉన్న ఉత్తమ్ పవార్ నివాసం
- ఇంటి మీదుగా వెళుతున్న సరిహద్దు రేఖ
అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఉండే కొన్ని గ్రామాలు సగం ఒక రాష్ట్రంలో, మరో సగం వేరే రాష్ట్రంలో ఉండడం అక్కడక్కడ చూస్తుంటాం. ఇదే తరహాలో ఓ ఇల్లు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఇల్లు కొంతభాగం మహారాష్ట్రలో ఉంటే, మిగతా భాగం తెలంగాణ రాష్ట్రంలో ఉంది.
చంద్రాపూర్ జిల్లాలోని మహరాజ్ గూడ గ్రామం వెళితే ఈ రెండు రాష్ట్రాల ఇంటిని చూడొచ్చు. ఈ ఇంట్లో హాలు, పడక గది మహారాష్ట్రలో ఉన్నాయి. కిచెన్ మాత్రం తెలంగాణ పరిధిలోకి వస్తుంది.
ఈ ఇంటి యజమాని పేరు ఉత్తమ్ పవార్. ఈ ఇంట్లో ఉత్తమ్ పవార్ కుటుంబంతో పాటు అతడి సోదరుడి కుటుంబం కూడా ఉంటోంది. ఈ ఇంటి మీద రెండు రాష్ట్రాల సరిహద్దు రేఖను కూడా గీశారు. ఆ ఇంట్లో ఏ భాగం ఏ రాష్ట్రం కిందికి వస్తుందనేది కూడా రాశారు.
ఇక ఈ ఇంట్లో 13 మంది నివసిస్తుండగా, వారి వాహనాల్లో కొన్ని మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కాగా, మరికొన్ని తెలంగాణ రిజిస్ట్రేషన్ కు చెందినవి. ఈ ఇంటిని ఉత్తమ్ పవార్, అతడి సోదరుడు పంచుకోగా, చెరో నాలుగు గదులు వచ్చాయి. ఉత్తమ్ పవార్ కు లభించిన కిచెన్ తెలంగాణ రాష్ట్రం పరిధిలోకి వస్తుందట. మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ఇటీవల ఈ ఇంటిని గురించిన కథనాలు సందడి చేస్తున్నాయి.