Rohit Sharma: శ్రీలంకతో సిరీస్‌కు భారత జట్ల ఎంపిక.. టీ20 సిరీస్‌కు రోహిత్, కోహ్లీ, రాహుల్ దూరం!

Rishabh Pant AXED from T20 and ODI teams Sanju Samson and Ishan Kishan return

  • టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా 
  • వన్డే జట్టులోనూ చోటు కోల్పోయిన శిఖర్ ధావన్
  • టీ20 వైస్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్
  • వన్డేలకు అందుబాటులో రోహిత్, కోహ్లీ, రాహుల్
  • రిషభ్ పంత్‌పైనా వేటు

శ్రీలంకతో స్వదేశంలో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ 20, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం భారత జట్లను సెలక్టర్లు ప్రకటించారు. బొటనవేలి గాయం నుంచి పూర్తిగా కోలుకోని కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 సిరీస్‌కు దూరం కాగా, బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్, మాజీ సారథి విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌కు దూరమయ్యారు. రాహుల్ తన పెళ్లి నేపథ్యంలో సిరీస్‌కు దూరమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కావాలని బీసీసీఐని కోహ్లీ కోరినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను టీ20 జట్టుకు కెప్టెన్‌గా నియమించారు. వైఎస్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తాడు. 

టెస్ట్ ఓపెనర్ శుభమన్ గిల్‌కు టీ20 జట్టులోనూ చోటు లభించింది. గతంలో జట్టుకు ఎంపికైనా అవకాశం రాని రాహుల్ త్రిపాఠిని ఈ సిరీస్‌కు మరోమారు ఎంపిక చేశారు. పేసర్లు శివమ్ మావి, ముకేశ్ కుమార్‌లు ఈ సిరీస్‌తో టీ20ల్లో అరంగేట్రం చేయబోతున్నారు. గాయం నుంచి బుమ్రా ఇంకా కోలుకోకపోవడంతో ఈ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ఇక, పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ వన్డే, టీ20 రెండు జట్లలోనూ స్థానం కోల్పోయాడు. శ్రేయాస్ అయ్యర్‌కు వన్డే జట్టులో చోటు లభించింది. ఇక, టీమిండియా స్టార్ బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న శిఖర్ ధావన్ ఇప్పటికే టీ20లకు దూరం కాగా, ఇప్పుడు వన్డే జట్టులోనూ అతడికి స్థానం లభించలేదు.

ఇక, శ్రీలంకతో టీ20 సిరీస్‌కు దూరమైన రోహిత్ శర్మ, కోహ్లీ, రాహుల్ వన్డేలకు మాత్రం అందుబాటులో ఉండనున్నారు. రోహిత్ తిరిగి రావడంతో వన్డే జట్టుకు హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్ వన్డే సిరీస్‌కు ఏకైక స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. కాగా, శ్రీలంక పర్యటన వచ్చే నెల 3 నుంచి ప్రారంభం అవుతుంది. తొలుత మూడు టీ 20లు, ఆ తర్వాత వన్డే సిరీస్ జరుగుతుంది. 3,5,7 తేదీల్లో ముంబై, పూణె, రాజ్‌కోట్‌లలో టీ20లు జరుగుతాయి. 10, 12, 15 తేదీల్లో గువాహటి, కోల్‌కతా, తిరువనంతపురంలలో వన్డేలు జరుగుతాయి.

టీ20 జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజుశాంసన్, సుందర్, చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్, హర్షల్, ఉమ్రాన్, శివమ్ మావి, ముకేశ్ కుమార్

వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్.

  • Loading...

More Telugu News