Bharat Biotech: ప్రభుత్వాసుపత్రుల్లోనూ ముక్కు టీకా.. రూ. 325 మాత్రమే!
- జనవరి నాలుగోవారం నుంచి కొవిన్ యాప్ ద్వారా అందుబాటులోకి
- గతంలో ఎవరు ఎలాంటి వ్యాక్సిన్ తీసుకున్నా వేయించుకోవచ్చు
- ఇప్పటి వరకు టీకా వేయించుకోని వారు రెండు డోసులుగానూ తీసుకోవచ్చు
- ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రం టీకా ధర రూ. 1000
ప్రపంచవ్యాప్తంగా కరోనా భయాలు అలముకున్న వేళ టీకాలపై ప్రభుత్వం మళ్లీ దృష్టిసారించింది. కరోనా వైరస్ చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తుండడం, దేశంలోనూ కేసులు స్వల్పంగా పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమ్తతం చేసింది. ఇప్పటికే రెండు డోసుల టీకాలు తీసుకున్న వారు ప్రికాషన్ డోసులు తీసుకోవాలని కోరింది. మరోవైపు, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు అమలు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా నాజల్ టీకా అందుబాటులోకి వచ్చింది. భారత్ బయోటిక్ అభివృద్ధి చేసిన ముక్కు ద్వారా తీసుకునే టీకా ‘ఇన్‌కోవ్యాక్’ వచ్చే నెల నాలుగో వారం నుంచి కొవిన్ యాప్ ద్వారా అందుబాటులోకి రానుంది. సింగిల్ డోస్ టీకా అయిన దీనిని ప్రభుత్వాసుపత్రులు, ఆరోగ్య, టీకా కేంద్రాల్లో వేయించుకోవచ్చు. ధర రూ. 325 మాత్రమే.
ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఈ టీకాను అందుబాటులోకి తెస్తున్నారు. అయితే, అక్కడ దాని ధరను రూ. 800గా నిర్ధారించినప్పటికీ జీఎస్టీ, అడ్మినిస్ట్రేటివ్ చార్జీలు కలుపుకుని రూ. 1000 అవుతుంది. గతంలో ఎవరు ఎలాంటి టీకా వేయించుకున్నా ప్రికాషన్ డోసుగా దీనిని వేయించుకోవచ్చు. ఒకవేళ ఇప్పటి వరకు టీకా తీసుకోకుంటే దీనిని రెండు డోసుల టీకాగా కూడా ఉపయోగించుకోవచ్చు.