Jammu And Kashmir: జమ్మూ కశ్మీర్​ లో ఎన్​ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

3 terrorists killed in encounter with security forces in Sidhra
  • ట్రక్కులో కశ్మీర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులు
  • అనుమానంతో సిద్రా ప్రాంతంలో ట్రక్కును ఆపిన భద్రతా సిబ్బంది
  • ట్రక్కును తనిఖీ చేస్తుండగా కాల్పులు జరిపిన ఉగ్రవాదులు
జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వెంబడి సిధ్రా బైపాస్ ప్రాంతంలోని తావి వంతెన సమీపంలో తీవ్రమైన పొగమంచు మధ్య బుధవారం ఉదయం కాల్పులు జరిగాయి. ముగ్గురు ఉగ్రవాదులు ట్రక్కులో కశ్మీర్ వైపు వెళుతుండగా, భద్రతా బలగాలు సిధ్రా చెక్‌పాయింట్ సమీపంలో వాహనాన్ని ఆపివేసాయి. పోలీసులు ట్రక్కును తనిఖీ చేస్తుండగా ఉగ్రవాదులు లోపల నుంచి కాల్పులు ప్రారంభించారు. భద్రతా దళాలు కూడా ఎదురుకాల్పులు జరిపారు. దాంతో, ట్రక్కులో మంటలు చెలరేగి, ఉగ్రవాదులు హతమయ్యారు. 

ఇరు వర్గాల మధ్య దాదాపు 45 నిమిషాలకు పైగా కాల్పులు జరిగాయి. గ్రెనేడ్‌లు విసరడంతో పాటు పేలుళ్లు కూడా సంభవించాయి. ‘కశ్మీర్ వైపు వెళ్తున్న ట్రక్కు అనుమానాస్పదంగా కనిపించింది. దాంతో దాన్ని వెంబడించి సిధ్రా చెక్ పాయింట్ దగ్గర ఆపారు. మూత్ర విసర్జన అనే నెంపతో డ్రైవర్ తప్పించుకున్నాడు' అని జమ్మూ కశ్మీర్ ఏడీజీపీ తెలిపారు. ఉగ్రవాదులు ఎక్కడి నుంచి చొరబడ్డారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ట్రక్కును పరిశీలించిన తర్వాత స్పష్టత వస్తుందని పోలీసు అధికారి తెలిపారు. పారిపోయిన ట్రక్కు డ్రైవర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
Jammu And Kashmir
Encounter
3 terrorists
army
kills

More Telugu News