sitting: నేలపై కూర్చుంటే ఏంటి లాభం?
- నేలపై కూర్చోవడం వల్ల తుంటి కండరాలు బలోపేతం
- ఫలితంగా నడవడానికి, బ్యాలన్స్ కు మేలు
- వెన్నెముక ఆరోగ్యానికి మంచిదంటున్న వైద్యులు
నేలపై కూర్చోవడం అన్నది భారతీయులకు శతాబ్దాల నుంచి ఆచరణలో ఉన్న విధానం. 50 ఏళ్ల క్రితం చాలా మంది ఇళ్లల్లో కూర్చోవడానికి కుర్చీలు కూడా ఉండేవి కావు. కానీ, ఇప్పుడు కుర్చీలు లేని ఇళ్లు అరుదుగా కనిపిస్తుంటాయి. మనం నేలపై కూర్చుని భోజనం చేస్తాం. టాయిలెట్లు సైతం కింద కూర్చునే మోడల్ లోనే మన దేశంలో కనిపిస్తాయి. ఇలా కింద కూర్చోవడం వల్ల వృద్ధాప్యంలో మోకీళ్ల సమస్యలు వస్తాయనే భయం ఏర్పడిందే కానీ.. గతంలో ఈ సమస్య లేదు. యోగాసనాలన్నీ కూడా కింద కూర్చుని చేసేవే. వైద్య నిపుణులు కింద కూర్చోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్టు చెబుతున్నారు.
‘‘మన వెన్నెముక నిటారుగా ఉండదు. ఎస్ ఆకారంలో, మెడ, థొరాసిక్, లంబార్ ప్రాంతంలో మూడు సహజ వంపులతో ఉంటుంది’’ అని ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ వరలక్ష్మి యనమండ్ర వివరించారు. ఇందుకు సంబంధించి ఆమె ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ను పరిశీలించొచ్చు. (ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ కోసం)
ప్రయోజనాలు
వెన్నెముక ఆరోగ్యంగా ఉండాలంటే కింద కూర్చోవడం అంత మంచి అలవాటు మరొకటి లేదని ఆమె చెబుతున్నారు. వెన్నెముకకు అనుకూలమైన భంగిమలో కూర్చోవడం ముఖ్యమని గుర్తు చేస్తున్నారు. ‘‘కింద కూర్చోవడం వల్ల వెన్నెముకకు స్థిరత్వం వస్తుంది. తుంటి కండరాలు బలపడతాయి. తుంటి కండరాలు తొడలు, పొత్తికడుపుతో అనుసంధానమై ఉంటాయి. తుండి కండరాలు బలహీనంగా ఉంటే మన నడక సామర్థ్యంపై, స్థిరత్వం, బ్యాలన్స్ పై ప్రభావం పడుతుంది. కనుక కింద కూర్చోవడం వల్ల కండరాలు బలపడతాయి. అలా అని కుర్చీల్లో కూర్చోవడం మానేయాలని చెప్పడం లేదు. రోజులో కనీసం కొన్ని నిమిషాలు అయినా కింద కూర్చోవాలన్నది సూచన’’ అని తన పోస్ట్ లో సూచించారు.