Andhra Pradesh: రాత్రిపూట ఇరుకు సందుల్లో సభ పెట్టకూడదనే విషయం చంద్రబాబుకు తెలియదా?: ఏపీ హోంమంత్రి
- చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే ఈ ఘటన జరిగిందన్న తానేటి వనిత
- గోదావరి పుష్కరాల సమయంలో కూడా 29 మంది ప్రాణాలను బలితీసుకున్నారని మండిపాటు
- కందుకూరు ఘటనపై కేసు నమోదు చేశామని వెల్లడి
నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో దురదృష్టవశాత్తు ఎనిమిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ హోంమంత్రి తానేటి వనిత స్పందిస్తూ.... చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే ఈ ఘటన చోటుచేసుకుందని విమర్శించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్లు సీఎం అని చెప్పుకునే చంద్రబాబుకు రాత్రిపూట ఇరుకు సందుల్లో సభ నిర్వహించకూడదనే విషయం తెలియదా అని ప్రశ్నించారు.
ఇదే పబ్లిసిటీ పిచ్చితో గోదావరి పుష్కరాల సమయంలో 29 మంది ప్రాణాలను బలి తీసుకున్నారని అన్నారు. ఓవైపు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుంటే.. తమ్ముళ్లూ ఇక్కడే ఉండండి, మళ్లీ వచ్చి మాట్లాడతానని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందని తెలిపారు. ప్రజల నుంచి సానుభూతిని పొందేందుకు చంద్రబాబు విఫలయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. కందుకూరు ఘటనపై కేసు నమోదు చేశామని చెప్పారు.