RVM: ఇక ఉన్న చోటు నుంచే ఓటు.. అందుబాటులోకి వచ్చేస్తున్న ఆర్‌వీఎం!
- వలస వెళ్లిన వారు ఉన్న చోటు నుంచే ఓటు వేసే సదుపాయం
- ఆర్‌వీఎంలను అందుబాటులోకి తెస్తున్న ఎన్నికల సంఘం
- వచ్చే నెల 16న రాజకీయ పార్టీల ఎదుట ప్రదర్శన
- జనవరి 31లోపు తమ అభిప్రాయాలు చెప్పాల్సిందిగా కోరిన ఈసీ
బతుకుదెరువు కోసం ఎక్కడికో వలస వెళ్లి ఎన్నికల సమయంలో సొంతూరుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే వారు చాలామందే ఉంటారు. ఇది ఎంత వ్యయ ప్రయాసలతో కూడుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఇకపై ఈ బాధ ఉండదు. వలస వెళ్లిన వారు ఉన్నచోటు నుంచే స్వస్థలంలో ఓటుహక్కు వినియోగించుకునేందుకు త్వరలోనే ఆర్‌వీఎంలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఆర్‌వీఎం అంటే మరేంటో కాదు.. రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్. ప్రస్తుతం ఉన్న ఈవీఎంలలానే ఇవి కూడా పనిచేస్తాయి.
ఈ సరికొత్త విధానాన్ని వచ్చే నెల 16న రాజకీయ పార్టీల ఎదుట ప్రదర్శించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగే ఈ కొత్త ప్రయోగ పరిశీలనకు 8 జాతీయ, 57 ప్రాంతీయ పార్టీలను ఆహ్వానించింది. ఈ ప్రదర్శన అనంతరం జనవరి 31లోపు దీనిపై తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా చెప్పాలంటూ నిన్న 13 పేజీల పత్రాన్ని ఆయా పార్టీలకు పంపింది. ఈ సరికొత్త ఆర్‌వీఎం వ్యవస్థ అందుబాటులోకి వస్తే వలస వెళ్లిన వారికి కష్టాలు తప్పినట్టే.
పెరగనున్న ఓటింగ్ శాతం
ఆర్‌వీఎం వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. గత సాధారణ ఎన్నికల్లో 67.4 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే దాదాపు 30 కోట్ల మంది ఓటర్లు ఓటింగ్‌కు దూరమయ్యారు. దీనికి చాలానే కారణాలు ఉన్నాయి. అద్దె ఇళ్లలో ఉన్నవారు మరో ఇంటికి మారడం, వలస వెళ్లిన వారు అక్కడే ఉండడం వంటి కారణాలతో వారు ఓటు వేయలేకపోతున్నారు. వేరే చోటికి వెళ్లాక అక్కడ ఓటు నమోదు చేసుకోకపోవడం కూడా ఇందుకు మరో కారణం.
ఇప్పుడు వీటన్నింటికీ పరిష్కారంగా వీఆర్ఎంలు రాబోతున్నాయి. అయితే, ఎన్నికల సంఘం ప్రతిపాదిస్తున్న ఈ సరికొత్త విధానాన్ని కొన్ని పార్టీలు ఆహ్వానిస్తుంటే, మరికొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈవీఎంలపైనే సందేహాలున్న ప్రస్తుత తరుణంలో వీఆర్ఎంలకు విశ్వసనీయత ఏంటంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ప్రశ్నించారు. అయితే, రిమోట్ ఓటింగ్ అనేది ఓటింగ్ వ్యవస్థను మార్చేస్తుందని, ఎన్నికల ప్రజస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఇది దోహద పడుతుందని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.