Max Hospital: రిషబ్ పంత్ ఆరోగ్యంపై తాజా సమాచారాన్ని వెల్లడించిన వైద్యులు
- పంత్ ఆరోగ్య స్థితి నిలకడగానే ఉందని వెల్లడి
- డెహ్రాడూన్ లోని మ్యాక్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న క్రికెటర్
- పరీక్షలన్నీ ముగిసిన తర్వాత పూర్తిస్థాయి బులెటిన్ విడుదల
ఘోర రోడ్డు ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డ ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ ఆరోగ్య స్థితి పై వైద్యులు తొలి బులెటిన్ (సమాచారం) విడుదల చేశారు. డెహ్రాడూన్ లోని మ్యాక్స్ హాస్పిటల్ లో పంత్ చికిత్స పొందుతున్నాడు.
‘‘ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జన్ల పర్యవేక్షణలో క్రికెటర్ రిషబ్ పంత్ ఉన్నారు. ఆయన కండిషన్ నిలకడగానే ఉంది. పరీక్షలన్నీ ముగిసిన తర్వాత పూర్థిస్థాయి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తాం’’ అని మ్యాక్స్ హాస్పిటల్ తరఫున డాక్టర్ ఆశిష్ యాగ్నిక్ ప్రకటించారు.
ఈ ఉదయం రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొని అగ్నికి ఆహుతి కావడం తెలిసిందే. కారు డోర్ విండోను బద్దలు కొట్టుకుని రిషబ్ బయటపడగా, తీవ్ర గాయాల పాలయ్యాడు. తలపై గాయాలు, మోకాలి లిగమెంట్ తెగిపోవడం, వీపు భాగంలో కాలడం జరిగింది. ఢిల్లీకి వెళుతుండగా, రూర్కీ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
పంత్ త్వరగా కోలుకోవాలని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆకాంక్ష వ్యక్తం చేశాడు. అలాగే, నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ ట్విట్టర్లో స్పందిస్తూ.. ‘‘రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. అదృష్టం కొద్దీ అతడు ప్రాణ ప్రమాదం నుంచి బయటపడ్డాడు’’ అని పేర్కొన్నాడు.