Bandla Ganesh: పవన్ ఛాన్స్ ఇవ్వడానికి ముందు నా పరిస్థితి ఏంటంటే ..: బండ్ల గణేశ్
- తొలిరోజుల్లో పడిన ఇబ్బందులను ప్రస్తావించిన బండ్ల
- డైరెక్టర్లను పొగిడితే ఛాన్సులు ఇచ్చేవారని వ్యాఖ్య
- రియల్ ఎస్టేట్ లో కలిసొచ్చిందని వివరణ
- పవన్ వల్లనే ఇంత గుర్తింపు అని వెల్లడి
బండ్ల గణేశ్ .. పరిచయం అవసరం లేని పేరు. చిన్న చిన్న పాత్రలతో తన కెరియర్ ను మొదలుపెట్టిన ఆయన, స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఈవీవీ గారి 'ప్రేమఖైదీ' సినిమాలో జూనియర్ ఆర్టిస్టుగా చేశాను. ఆ వేషం వేసినందుకు నటుడిగా నేను తొలి పారితోషికం అందుకున్నాను. ఆ తరువాత యాక్టర్ కావాలనే ఉద్దేశంతో గట్టి ప్రయత్నాలు చేయడం మొదలెట్టాను' అన్నాడు.
చెన్నై లో సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాను. నాకంటే ఎత్తుగా .. ఎర్రగా ఉన్న వాళ్లకే అవకాశాలు లేకుండా ఉండటం చూశాను. ఇక ఆ దిశగా ట్రై చేయడం వేస్టు అని అనుకున్నాను. ఈ వేషం 'బండ్ల గణేశ్' మాత్రమే వేయాలి అనే స్థాయికి నేను ఎప్పుడూ రాలేదు. ఎప్పటికప్పుడు వేషాలు ఇవ్వమని అడిగే స్థాయిలోనే ఉండేవాడిని" అని చెప్పారు.
"కొండ ప్రాంతాల్లో ఉండేవారు .. ఇకపై కాలం కలిసొస్తుందని ఓ నాలుగు మంచి మాటలు చెబితే డబ్బులు ఇవ్వడం చూస్తుంటాము. నేను కూడా అలాగే డైరెక్టర్ల దగ్గర ఉంటూ .. 'మీ డైరెక్షన్ సూపర్ .. మీ బొమ్మ బ్లాక్ బస్టర్' అని పొగుడుతూ ఉంటే చిన్నవేషం ఇచ్చేవారు. ఆ తరువాత రియల్ ఎస్టేట్ లో కలిసొచ్చింది. ఇక నిర్మాతగా మారడానికీ .. ఈ రోజున ఇంత పేరు రావడానికి కారణం మాత్రం పవన్ కల్యాణ్ గారే" అంటూ చెప్పుకొచ్చాడు.