Rahul Gandhi: ఎలా ఉండకూడదో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లను చూసి నేర్చుకున్నా: రాహుల్ గాంధీ

What About Their Roadshows Rahul Gandhi On Security Red Flags
  • ఈ విషయంలో వాటిని తన గురువుగా భావిస్తానని 
    ఎద్దేవా చేసిన కాంగ్రెస్ నేత
  • తన యాత్రకు కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని
     ఆరోపించిన రాహుల్
  • బీజేపీ వాళ్లు చేస్తున్న రోడ్ షోల సంగతేంటని ప్రశ్నించిన  రాహుల్ గాంధీ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఆర్ఎస్)లపైనా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఎలా ఉండకూడదో, ఎలాంటి పనులు చేయకూడదనే విషయాన్ని తాను బీజేపీ, ఆర్ఎస్ఎస్ లను చూసి నేర్చుకున్నానని చెప్పారు. ఈ విషయంలో వాటిని తన గురువుగా భావిస్తానంటూ ఎద్దేవా చేశారు.

ఇక, 'భారత్ జోడో యాత్ర' పేరుతో దేశ వ్యాప్త పాదయాత్రను అడ్డుకోవాలని బీజేపీ కుట్ర చేస్తోందని రాహుల్ ఆరోపించారు. ఎలాంటి కారణం లేకుండా తనపై కేసు పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. తాను పదే పదే భద్రతా ప్రొటోకాల్ ను ఉల్లంఘిస్తున్నానని భద్రతా సిబ్బందితో చెప్పించాలని చూస్తోందని ఆరోపించారు. భద్రతా ప్రొటోకాల్, కొవిడ్ నిబంధనల సాకుతో యాత్రను ఆపివేయమని లేఖలు పంపడం సరైంది కాదన్నారు. 

బీజేపీ కూడా రోడ్ షోలు చేస్తోందని, వాటికి కొవిడ్ నిబంధనలు వర్తించవా? అని ఆయన ప్రశ్నించారు. ‘మీరు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో వెళ్లండి అని హోం మంత్రిత్వ శాఖ చెబుతోంది, నేను యాత్ర ఎలా చేయగలను? యాత్ర కోసం నేను కాలినడకన సాగాలి. భద్రత కోసం ఏమి చేయాలో వారికి తెలుసు. వారే అనవసరంగా సమస్యను సృష్టిస్తున్నారు’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇక, బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకం కావాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు, ఆ పార్టీపై తీవ్ర ప్రజావ్యతిరేకత ఉందన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతిపక్షాలు సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని అన్నారు.
Rahul Gandhi
bharath jodo yatra
BJP
rss

More Telugu News