Rahul Gandhi: భారత్ జోడో యాత్రను తొలుత ఒక యాత్రగా మాత్రమే చూశాను.. కానీ..: రాహుల్ గాంధీ
- ఎప్పటికీ చేయకూడనివి ఏమిటో బీజేపీ నేర్పుతోందన్న రాహుల్
- భారత్ జోడో యాత్రలో ప్రతి ఒక్కరికీ తలుపులు తెరిచే ఉంటాయని వ్యాఖ్య
- తమతో చేరకుండా ఎవరినీ ఆపబోమన్న రాహుల్
తన జీవితానికి సంబంధించి బీజేపీ రోడ్ మ్యాప్ చూపిస్తుందని... ఎప్పటికీ చేయకూడనివి ఏమిటో నేర్పుతోందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. అందుకే ఈ విషయంలో బీజేపీ తనకు గురువు అని చెప్పారు. తమపై దూకుడుగా దాడి చేయాలని బీజేపీ అనుకుంటోందని... కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని అన్నారు.
భారత్ జోడో యాత్రను కన్నియాకుమారిలో ప్రారంభించే సమయంలో దీన్ని తాను కేవలం ఒక యాత్రగా మాత్రమే చూశానని... అయితే ఇప్పుడు ఈ యాత్ర ఒక గొంతుకను, ప్రజల భావాలను కలిగి ఉందని చెప్పారు. భారత్ జోడో యాత్రలో ప్రతి ఒక్కరికి తలుపులు తెరిచే ఉంటాయని... తమతో చేరకుండా తాము ఎవరినీ ఆపబోమని అన్నారు. సెప్టెంబర్ 7న భారత్ జోడో యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొత్తం 5 నెలల పాటు 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా 3,570 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. కశ్మీర్ లో యాత్ర ముగుస్తుంది.