China: చైనాలో రోజుకు 9 వేల కరోనా మరణాలు... బ్రిటన్ సంస్థ వెల్లడి
- చైనాలో నవంబరులో లాక్ డౌన్ ఎత్తివేత
- భారీస్థాయిలో ప్రబలిన కరోనా వైరస్
- బయటికి రాని వాస్తవ గణాంకాలు
- అంచనాలు రూపొందించిన ఎయిర్ ఫినిటీ సంస్థ
- ఆస్ట్రేలియా మీడియాలో కథనం
నవంబరు నెలలో కొవిడ్ లాక్ డౌన్లు, ఆంక్షలు ఎత్తివేశాక చైనాలో మహమ్మారి వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసినా, వాస్తవ గణాంకాలు మాత్రం బయటికి రావడంలేదు! చైనా మీడియా అంతా ప్రభుత్వ కనుసన్నల్లోనే నడుస్తుందన్న విషయం తెలిసిందే. అయితే, బ్రిటన్ కు చెందిన ఎయిర్ ఫినిటీ సంస్థను ఉటంకిస్తూ ఆస్ట్రేలియన్ మీడియా ఓ కథనం వెలువరించింది.
చైనాలో ప్రస్తుతం రోజుకు 9 వేల కరోనా మరణాలు నమోదవుతున్నాయని ఎయిర్ ఫినిటీ వెల్లడించినట్టు పేర్కొంది. అంచనాలకు రెండింతల కరోనా మరణాలు చోటుచేసుకుంటున్నట్టు తెలిపింది. చైనాలోని వివిధ ప్రావిన్స్ ల నుంచి అందిన సమాచారం ఆధారంగా ఈ గణాంకాలు వెల్లడించినట్టు ఎయిర్ ఫినిటీ తెలిపిందని ఆస్ట్రేలియా మీడియా సంస్థ పేర్కొంది.
ఇతర దేశాల్లో కరోనా ఆంక్షలు ఎత్తివేశాక నమోదైన కేసుల వృద్ధి రేటును పరిగణనలోకి తీసుకుని చైనా పరిస్థితులపై ఎయిర్ ఫినిటీ ఓ నమూనా రూపొందించింది. చైనాలో డిసెంబరులో రోజుకు లక్ష కేసులు నమోదవుతుండగా, జనవరి రెండో వారం నాటికి 37 లక్షల కేసులు నమోదవుతాయని వివరించింది. జనవరి 23 నాటికి చైనాలో 5.84 లక్షల మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.