Drunk Driving: మందుబాబులకు తెలంగాణ రవాణా శాఖ షాక్..!
- తాగి వాహనం నడిపిన వారి లైసెన్స్ రద్దు
- గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 5,819 వాహనదారుల లైసెన్సులు రద్దు చేసిన అధికారులు
- కొత్త ఏడాది మొదటిరోజే 3,220 లైసెన్సులపై వేటు
మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై రవాణా శాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడిన వారి లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేయడంతో పాటు అధికారులు వారికి భారీగా జరిమానా విధిస్తున్నారు. ఇటీవలే ఈ జరిమానా మొత్తాన్ని రవాణా శాఖ రూ.10 వేలకు పెంచింది. గతేడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 5,819 మంది వాహనదారుల లైసెన్సులను అధికారులు రద్దు చేశారు. ఈ ఏడాది మొదటి రోజే 3,220 మంది వాహనదారులకు షాక్ ఇచ్చారు.
హైదరాబాద్ లో గతేడాది రద్దు చేసిన వాహనదారుల లైసెన్సుల సంఖ్య 4,109 కాగా.. అందులో నార్త్ జోన్ లో 1,103, సౌత్ జోన్ లో 1,151, ఈస్ట్ జోన్ లో 510, వెస్ట్ జోన్ లో 1,345 మంది లైసెన్సులు రద్దయ్యాయి. ఇందులో ఎస్ ఆర్ నగర్ లో 73, పంజాగుట్టలో 51, బంజారాహిల్స్ లో 48, జూబ్లీహిల్స్ లో 49 లైసెన్సులు రద్దు చేసినట్లు రవాణా శాఖ అధికారులు చెప్పారు.
తాగి వాహనాలను నడిపితే కఠిన చర్యలు తప్పవని అధికారులు ఎప్పటికప్పుడు వాహనదారులను హెచ్చరిస్తూనే ఉన్నారు. రాత్రిపూట హైదరాబాద్ లోని పలు ఏరియాల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతూ మందుబాబులను పట్టుకుంటున్నారు. అక్కడికక్కడే వాహనాలను సీజ్ చేసి, వాహనదారులకు నోటీసులు ఇస్తున్నారు. మందుబాబులను కోర్టులో ప్రవేశపెడుతున్నారు. ట్రాఫిక్ పోలీసుల నివేదిక, తనిఖీలలో గుర్తించిన తీవ్రత ఆధారంగా కోర్టులు వాహనదారులకు జరిమానా, లైసెన్స్ తాత్కాలిక రద్దు ఆదేశాలు జారీ చేస్తోంది. కొన్ని సీరియస్ కేసులలో తాగి వాహనం నడిపిన వారికి జైలు శిక్ష కూడా విధిస్తోంది.